ఢిల్లీ: ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతం కీర్తి నగర్లో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులను ఎస్యూవీ కారు ఢీకొట్టింది. ఆర్య సమాజ్ మందిర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కారును నడుపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వృద్ధ దంపతులు రోడ్డుకు ఎడమ వైపున నడుచుకుంటూ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన క్రెటా కారు వారిని ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో ఇద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. చేతిలో వాకింగ్ స్టిక్, భుజానికి బ్యాగ్ ధరించిన వృద్ధురాలు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి సమీపంలో పడిపోయారు. ఆమె భర్త కారు బానెట్‌పై సుమారు రెండు సెకన్ల పాటు పడిన అనంతరం రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఆయన ముఖం నేలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం తర్వాత కారు డ్రైవ్ చేస్తున్న ఆ మహిళ వ్యవహరించిన తీరు కూడా సీసీటీవీలో రికార్డైంది. మొదట ఆమె కారు నుంచి బయటకు రావాలా వద్దా? అన్నట్లుగా కొద్దిసేపు ఆలోచించింది. కారు డోర్ తెరిచి మళ్లీ మూసివేసి సుమారు ఏడు సెకన్ల పాటు కారులోనే కూర్చుంది. అనంతరం కిందకు దిగి వృద్ధుడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పరిస్థితిని పరిశీలించింది. ఆ తర్వాత కొంత దూరంలో పడివున్న వృద్ధురాలి వైపు చూసింది.
🚨 An elderly couple Dayanand Tagra (79) and Kusum Tagra (71) were injured after being hit by a Creta near Arya Samaj Mandir in Kirti Nagar West Delhi on 2nd Oct. Both are undergoing treatment at Kalra Hospital. Delhi Police have arrested the 49-year-old driver, Navleen Kaur ⚠️ https://t.co/NmSrBoWPsa
— Dr. Abhinaba Pal (@drabhinabapal7) October 3, 2026
అనంతరం ఆమె చేతులు జోడించి పైకి చూస్తూ కనిపించింది. ఇద్దరి ప్రాణాలు దక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపినట్లుగా సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ తర్వాత తిరిగి కారులోకి వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 71 ఏళ్ల కుసుమ్ టాగ్రా, 79 ఏళ్ల ఆమె భర్త దయానంద్ టాగ్రాగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ కీర్తి నగర్‌లోని కల్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పిల్లలు అమెరికాలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధుడు


