ఖిలా వరంగల్: ఆప్పులు..అవమానాలు, బెదిరింపులు వెంటాడాయి. దీంతో మానసిక వేదనతో దంపతులు తనువు చాలించారు. పెంపుడు కుక్కనూ తమవెంట పైలోకానికి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్‌లోని రంగశాయిపేట ఎస్‌బీఐ బ్యాంకు లేన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటకు చెందిన నల్లపోగుల సంజయ్‌కుమార్ (60) ఆయన భార్య శోభ (55) అద్దె ఇంట్లో ఉంటున్నారు.
సంజయ్‌కుమార్ తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు కుక్కను పెంచుకుంటున్నారు. సంజయ్‌కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతోపాటు అప్పులిచ్చిన ఓ మహిళ వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. సూసైడ్ నోట్ రాసి కుక్కతోపాటు భార్యాభర్తలు సోమవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వెళ్లిన బంధువుకు దంపతులతోపాటు కుక్క కూడా వేలాడుతున్న దృశ్యాలు చూసి ఇరుగురుపొరుగు సాయంతో వారిని కిందకు దింపారు. అప్పటికే వారు చనిపోయారు.
అప్పులే ఆ కుటుంబానికి శాపమయ్యాయి?
సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం.. సంజయ్‌కుమార్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఓ మహిళ దగ్గర రూ.50 వేలు ఆప్పుగా తీసుకున్నాడు. రూ.10వేలు ఆప్పు తీసుకుంటే వారానికి రూ.750 చొప్పున గిరిగిరి వడ్డీని 11 నెలలుగా కడుతున్నట్టు లేఖలో వివరించారు. అనారోగ్యంతో మూడు నెలలపాటు చెల్లింపులు నిలిచిపోవడంతో ఆ మహిళ నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఇంటికి మనుషులను పంపించి పరువు తీస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా.. వారు ముంబైలో ఓ బట్టల షాపులో పనిచేస్తున్నట్టు సమాచారం. చిన్న కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
కుటుంబంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో అప్పులు తీర్చడం భారంగా మారాయి. అప్పులు చెల్లించేందుకు సమయం ఇవ్వకుండా వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తమ కష్టసుఖాల్లో కుక్క తోడుగా నిలిచిందని, దానిని పెంచుకునే పరిస్థితి కూడా లేదని, అందుకే తమవెంట తీసుకెళ్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తమతోపాటే ఆ పెంపుడు జంతువుకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరారు. తమ అంత్యక్రియలు ప్రభుత్వమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తమ అవయవాలు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంటే దానం చేయాలని అభ్యర్థించారు.


