సాక్షి, హైదరాబాద్: లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తల్లిగా నటించిన నటి గోగినేని అనితా చౌదరిని సైబర్ నేరస్తులు మోసగించారు. అమెరికాలో ఉన్న తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న నటికి.. విమాన టికెట్ల బుకింగ్ పేరుతో కేటుగాళ్లు రూ.4.14 లక్షలు కాజేశారు. నటి అనిత మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.
వాషింగ్టన్ డీసీకి వెళ్లివచ్చేందుకు బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని భావించారు. ఈనెల 12న ట్రావెల్ ఏజెన్సీ కోసం ఇంటర్‌నెట్‌లో వెతకగా.. ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థ పేరు కనిపించింది. అందులోని రాజేష్ అనే ఏజెంట్ నంబరుకు సంప్రదించగా.. టికెట్ ధర రూ.4,14,180 అని పేర్కొన్నారు. టికెట్లు బుకింగ్ చేయాలంటే డెబిట్ కార్డ్ వివరాలు కావాలని బాధితురాలికి సూచించారు. వాళ్లు పంపిన ఒక వ్యూ ఫామ్‌లో అనిత తన డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేశారు.
ఆ సమయంలో ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉంచిన నిందితుడు.. మొబైల్‌కు వచ్చిన ఓటీపీలను చెప్పాలని సూచించాడు. టికెట్ల బుకింగ్ కోసమేనని భావించిన ఆమె.. వివరాలను వెల్లడించడంతో క్లియర్‌ట్రిప్ ద్వారా రూ.4,14,180 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత ఆమెకు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ రాకపోవడంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు పోలీసులు రాజే పై కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.


