సాక్షి, హైదరాబాద్: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించేలా ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అయితే, ప్రస్తుతం అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచాలని సీఎం సూచించారు. అలాగే ప్రమాద బీమా కింద అందించే రూ.10 లక్షల మొత్తాన్ని యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. నవంబర్ 19న సిద్ధిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తును విడుదల చేయనున్నారు.
ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అయితే, ఇప్పటికే బీమా భద్రత పొందుతున్న వారిలో ఏ ఒక్కరూ కొత్త విధానంలో లబ్ధికి దూరం కాకూడదని సీఎం స్పష్టం చేశారు. అర్హులందరికీ బీమా రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ‘365 మండలాల్లో కరువు ఉన్నప్పుడు సమ్మిట్ అవసరమా?’


