కోచ్‌లు లేకుండా పతకాలు ఎలా సాధిస్తాం?.. శాట్ కోచ్‌ల మెరుపు ధర్నా | How can we win medals without coaches says coaches at Dharna | Sakshi
Sakshi News home page

కోచ్‌లు లేకుండా పతకాలు ఎలా సాధిస్తాం?.. శాట్ కోచ్‌ల మెరుపు ధర్నా

Nov 17 2026 2:41 PM | Updated on Nov 17 2026 2:41 PM

How can we win medals without coaches says coaches at Dharna

సాక్షి, హైదరాబాద్‌: శాట్ (SAT)లో పనిచేస్తున్న కోచ్‌లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెరుపు ధర్నాకు దిగారు. క్రీడారంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కోచ్‌లను ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్‌లు లేకుండా క్రీడల్లో పతకాలు ఎలా సాధిస్తామని ప్రశ్నించారు.

2009 తర్వాత శాట్‌లో కోచ్‌ల నియామకాలు చేపట్టలేదని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కోచ్‌లను సైతం రెగ్యులరైజ్ చేయడం లేదని ఆరోపించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం పెంచడం లేదని, తమ న్యాయమైన సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌లో అత్యంత కీలకమైన కోచ్‌లకు శాట్‌లో డిప్యుటేషన్‌పై వచ్చిన ఉన్నతాధికారుల వల్ల అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఏజెన్సీల పేరుతో కోచ్‌ల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. క్రీడా ఈవెంట్ల నిర్వహణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వారు మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగ అభివృద్ధికి భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో చేతులు కలిపి నిధులను దుబారా చేస్తున్నారని శాట్ కోచ్‌లు ఆరోపించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి పతకాలు సాధించేలా తీర్చిదిద్దే కోచ్‌ల సంక్షేమాన్ని పక్కనపెట్టి, ఈవెంట్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కోచ్‌లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలని, కొత్త నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: యూపీ ఎన్నికల ప్రచారం... డిసెంబర్‌ నుంచే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement