PC: BCCI/Star Sports X
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దాల క్రితమే నేటి టీ20 తరహా మాదిరి విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులకు వినోదం పంచుతూ.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఘనత అతడిది.
పరుగుల వీరుడు
దూకుడైన ఆటకు మారుపేరైన వీరూ.. తన కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 8586, 8273, 394 పరుగులు సాధించాడు. ఇక సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్, వేదాంత్ కూడా తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.
భారీ శతకంతో అలరించిన ఆర్యవీర్
పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఇప్పటికే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఒమన్ వేదికగా ఇటీవల ఏసీసీ మెన్స్ ఆసియా అండర్-19 వన్డే టోర్నీలో ధనాధన్ బ్యాటింగ్‌తో తండ్రిని గుర్తుచేశాడు. ఈ మెగా ఈవెంట్లో ఐదు మ్యాచ్‌లలో కలిపి ఆర్యవీర్ చేసిన స్కోర్లు.. 70 నాటౌట్, 22, 160, 51, 58.
పాక్‌తో ఫైనల్లో అర్ధ శతకం
ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఫైనల్లో ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొట్టాడు. దాయాది విధించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అర్ధ శతకంతో జట్టు విజయానికి పునాది వేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొమ్మిది ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు.
తండ్రికి తగ్గ తనయుడు
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి.. ఒక్క వికెట్ తేడాతో గెలిచి ఆసియా కప్ చాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో 95.50 స్ట్రైక్‌రేట్‌తో 361 పరుగులు సాధించిన ఆర్యవీర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆర్యవీర్ సెహ్వాగ్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తండ్రికి తగ్గ తనయుడు అంటూ అభిమానులు సైతం అతడిని కొనియాడుతున్నారు.
చాలెంజింగ్‌గా అనిపించింది
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్యవీర్ సెహ్వాగ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒమన్‌లో అల్ అమిరెట్ పిచ్‌పై 10-15 ఓవర్లు బ్యాటింగ్ చేయడం నిజంగా కఠిన సవాలుతో కూడుకున్న పని. తొలి 10-15 ఓవర్లలో సీమ్ ఉంటుందనిపించింది.
విరాట్ కోహ్లికి వీరాభిమానిని
ఆ తర్వాత బంతి కాస్త టర్న్ అయినట్లు కూడా అనిపించింది. నిజంగా ఆ వికెట్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించింది. అలాంటి చోట కాసేపు నిలబడి పరుగులు సాధించడం నాకు సంతోషాన్నిచ్చింది. నేను విరాట్ కోహ్లికి వీరాభిమానిని. పరిస్థితులకు తగ్గట్లు రాణిస్తూ జట్టుకు అవసరమైన వేళ పరుగులు చేయడాన్ని ఇష్టపడతాను.
ఏదేమైనా సరే నా కెరీర్ తొలినాళ్ల నుంచే నాన్నతో పోలిక రావడం సహజం. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు నన్ను నాన్నతో పోలిస్తే నేనేమీ చేయలేను. అయితే ఒక్కటి మాత్రం నిజం.
నేను సెహ్వాగ్ 2.O అవ్వాలనుకోవడం లేదు
నేను సెహ్వాగ్ 2.O అవ్వాలనుకోవడం లేదు. నేను మొదటి ఆర్యవీర్ సెహ్వాగ్ కావాలనుకుంటున్నాను. నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడమే నాకిష్టం. అభిమానుల అభిప్రాయాలను మాత్రం నేను మార్చలేను’’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
నాతో పోల్చకండి
కాగా గతంలో సెహ్వాగ్ సైతం ఆర్యవీర్‌ను తనతో పోల్చి ఒత్తిడి పెంచవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఆర్యవీర్ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటే సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
ఇక ఆసియా కప్ ఫైనల్లో రాణించిన కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (80), ఆర్యవీర్ (58).. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మనాల్ చౌహాన్, మోహిత్ ఉల్వాపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. దేశానికి అద్భుతమైన విజయం అందించారని కొనియాడాడు.
ఇదిలా ఉంటే.. పాక్‌పై విజయానంతరం ఆర్యవీర్ తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ప్రేక్షకులు సెహ్వాగ్, సెహ్వాగ్ అంటూ తనను ఉత్సాహపరిచారని.. ఒత్తిడిగా అనిపించిన సమయంలో ‘సీతారామ్’ నామస్మరణ చేసినట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి: పృథ్వీ షా విఫలం.. జట్టును గెలిపించిన సంజూ శాంసన్
"Not Sehwag 2.0, I want to be the first Aaryavir Sehwag!" 💙🏏 Aaryavir Sehwag opens up about comparisons with his father, adapting his game to the team's needs and carving his own identity in cricket! 🙌✨ #INDvPAK #U19AsiaCup2026 #U19MensAsiaCup https://t.co/RV1swbgIc8
— Star Sports (@StarSportsIndia) November 16, 2026


