అండర్-19 ఆసియా కప్ 2026 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం ఒమన్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన యంగ్ ఇండియా.. రికార్డు స్ధాయిలో 9వ సారి ఆసియాకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో మోహిత్ ఉల్వా(49), మనాల్ చౌహన్(47), లక్ష్య రాజేష్ రాయచందనీ(80)తో పాటు భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్(58) కూడా కీలక పాత్ర పోషించాడు.
338 పరుగుల లక్ష్య చేధనలో కెప్టెన్ రాయచందనీతో కలిసి ఆర్యవీర్ తొలి వికెట్‌కు 95 పరుగుల ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఈ అద్భుత విజయం తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్.. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ సమయంలో డగౌట్‌లో ఉన్న తన పరిస్థితిని ఆర్యవీర్ తండ్రికి వివరిస్తూ.. "నాన్నా.. ఆఖరి ఓవర్లో నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. నా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి నేను 'సీతారాం.. సీతారాం' అని జపిస్తూనే ఉన్నాను" అని చెప్పాడు.
భావోద్వేగానికి లోనైన వీరేంద్ర సెహ్వాగ్
కాగా టోర్నీ అసాంతం జూనియర్ సెహ్వాగ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఆర్యవీర్ మొత్తంగా 5 ఇన్నింగ్స్‌లలో 361 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న తన కుమారుడిని చూసి వీరేంద్ర సెహ్వాగ్ మురిసిపోయాడు. జట్టులోని ఆటగాళ్లందరికీ తన తరఫున శుభాకాంక్షలు చెప్పాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాల్ క్లిప్‌ను సెహ్వాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
"ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలవడం నుంచి ఆఖరి ఓవర్ ఉత్కంఠ వరకు నా కుమారుడు ఆర్యవీర్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణ ఇది. కొన్ని క్షణాలు అవార్డులు, పరుగులు, ట్రోఫీల కంటే ఎంతో గొప్పవి. ఒక తండ్రిగా నేను జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలివి. నీ కష్టంతో, ప్రతిభతో అత్యున్నత స్ధాయికి చేరుకోవాలని.. కానీ ఎప్పుడూ ఒదిగి ఉండాలి" అని భావోద్వేగంగా వీరేంద్రుడు రాసుకొచ్చాడు. కాగా పదో నంబర్ ఆటగాడు మోహిత్ ఉల్వా ఆఖరి బంతికి బౌండరీ బాది జట్టును గెలిపించాడు.


