పాకిస్తాన్‌ చేస్తే తప్పు లేదా?.. మాది తప్పుగా అనిపిస్తోందా?: భారత కెప్టెన్‌ | People Should See How Pak Celebrated IND U19 Captain On Asia Cup Celebrations | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ చేస్తే తప్పు లేదా?.. మాది తప్పుగా అనిపిస్తోందా?: భారత కెప్టెన్‌

Nov 16 2026 3:40 PM | Updated on Nov 16 2026 3:56 PM

People Should See How Pak Celebrated IND U19 Captain On Asia Cup Celebrations

PC: BCCI X

తమపై వస్తున్న విమర్శలకు భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. పాకిస్తాన్‌ చేయగా లేనిది.. తాము చేస్తే మాత్రం తప్పా? అంటూ విమర్శకులకు ప్రశ్నలు సంధించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచినపుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమే అంటూ తన జట్టును సమర్థించాడు.

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 వన్డే టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్‌.. దాయాది పాకిస్తాన్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే. అల్‌ ఎమిరెట్‌ వేదికగా శనివారం జరిగిన టైటిల్‌ పోరులో భారత్‌ విజయానికి ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. పదో నంబర్‌ బ్యాటర్‌ మోహిత్‌ ఉల్వా బౌండరీ బాదాడు. ఫలితంగా భారత్‌ ఒక్క వికెట్‌ తేడాతో గెలిచి చాంపియన్‌గా అవతరించింది.

అంబరాన్నంటిన సంబరాలు
చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై గెలవగానే భారత జట్టు శిబిరంలో సహజంగానే సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు ఒక్కసారిగా మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. హైదరాబాదీ యశ్‌వీర్‌ గౌడ్‌ అయితే.. పాక్‌ వికెట్‌ కీపర్‌ జహూర్‌పైకి దూసుకెళ్లి ముఖంలో ముఖం పెట్టి ఆగ్రహావేశాన్ని ప్రదర్శించాడు.

మీ పెంపకాన్ని సూచిస్తుంది
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ భారత జట్టు గెలుపు గొప్పదని అంగీకరిస్తూనే.. ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌ వారి పెంపకాన్ని సూచిస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

మరోవైపు.. భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం.. బలహీన పాక్‌ జట్టుపై కాకుండా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్లపై ప్రతాపం చూపాలని హితవు పలికాడు.

పాకిస్తాన్‌ చేస్తే తప్పు లేదా?.. మాది తప్పుగా అనిపిస్తోందా?
ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని స్పందించాడు. స్పోర్ట్స్‌ ‘నౌ’తో మాట్లాడుతూ.. ‘‘లీగ్‌ దశలో దీపావళి రోజున మాపై గెలిచినపుడు పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారో అందరూ చూడాలి. 

ఆట మొదలుపెట్టింది వాళ్లే. మేము కూడా అందుకు తగ్గట్లుగానే బదులిచ్చాము. మా సంబరాల్లో ఎలాంటి తప్పు లేదు. ఫైనల్లో గెలవడానికి మేము చాలా కష్టపడ్డాము. కాబట్టి సహజంగానే భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు’’ అని లక్ష్య జట్టును సమర్థించాడు.  

ఇదీ చదవండి: అతడొక అద్భుతం.. ధోనిని గుర్తుచేశాడు: టీమిండియా దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement