ఆఫ్గన్‌తో టెస్టు.. చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్‌ | Muzarabani Rewrite Record Books-Score 50 Plus-Bats No10-ZIM Vs AFG 2nd Test | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌తో టెస్టు.. చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్‌

Nov 16 2026 3:31 PM | Updated on Nov 16 2026 3:52 PM

Muzarabani Rewrite Record Books-Score 50 Plus-Bats No10-ZIM Vs AFG 2nd Test

Photo Credit: Twitter

జింబాబ్వే క్రికెట‌ర్ బ్లెసింగ్ ముజ‌ర‌బానీ టెస్టు క్రికెట్‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. షార్జా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో మొద‌లైన రెండో టెస్టులో ముజ‌ర‌బానీ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో అర్థ‌శత‌కంతో మెరిశాడు. ఈ నేప‌థ్యంలో ముజ‌ర‌బానీ ప‌దో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి ఫిఫ్టీ మార్క్ అందుకున్న తొలి జింబాబ్వే బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. 

మొత్తంగా 93 బంతులెదుర్కొని 59 ప‌రుగులు సాధించిన ముజ‌ర‌బానీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. అయితే ముజ‌రబానీ కంటే ముందు 2016లో న్యూజిలాండ్‌తో టెస్టులో డొనాల్డో టిరిపానో (49 నాటౌట్‌) అత్యుత్త‌మంగా ఉండేది. 1996లో బ్రియాన్ స్ట్రాంగ్ (42) మూడో స్థానంలో నిలిచాడు.

ఇక త‌న కెరీర్‌లో 20 టెస్టులాడిన ముజ‌రబానీకి ఇప్ప‌టిదాకా అత్యుత్త‌మ స్కోరు 47గా ఉండేది. 2025లో ఐర్లాండ్‌పై ఈ స్కోరును న‌మోదు చేశాడు. ఓవ‌రాల్‌గా 34 ఇన్నింగ్స్‌ల్లో 293 ప‌రుగులు చేశాడు. ఓవ‌రాల్‌గా టెస్టు క్రికెట్‌లో ప‌దో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసిన ఆట‌గాడిగా ఇంగ్లండ్‌కు చెందిన వాల్ట‌ర్ నిలిచాడు. 

1884లో ప‌దో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన వాల్ట‌ర్ శ‌త‌కంతో (117 ప‌రుగులు) మెరిశాడు. వాల్ట‌ర్ త‌ర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ హ‌స‌న్ (113 ప‌రుగులు) రెండో స్థానంలో ఉండ‌గా, భార‌త్ నుంచి ర‌మాకాంత్ దేశాయ్ (85) మూడో స్థానంలో, స‌య్య‌ద్ కిర్మాణి (63 నాటౌట్‌), మ‌ద‌న్ లాల్ (63 ప‌రుగులు నాటౌట్‌) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నారు.

మ్యాచ్ విష‌యానికొస్తే, ముజ‌ర‌బానీ అర్థ‌సెంచ‌రీకి తోడుగా గ్రేమీ క్రీమ‌ర్ (50 నాటౌట్‌) కూడా హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో జింబాబ్వే త‌మ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల న‌ష్టానికి 417 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. త‌ద్వారా అఫ్గానిస్తాన్ ముంగిట 417 ప‌రుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఆట‌కు మ‌రో రోజు మిగిలి ఉండ‌డంతో ఫ‌లితం వ‌చ్చేలా కనిపిస్తోంది.  అంత‌క‌ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 339 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, అఫ్గానిస్తాన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 217 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఇదీ చదవండి: Asia Cup: 'పాక్‌పై ప్రతాపం కాదు.. దమ్ముంటే వారిపై చూపించండి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement