source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మరో కీలక ట్రేడ్ డీల్ పూర్తయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. ఈ బదిలీని బీసీసీఐ మంగళవారం (నవంబర్ 17) అధికారికంగా ప్రకటించింది. రూ.4 కోట్లకు ఆల్ క్యాష్ డీల్ ద్వారా హర్షల్‌ను గుజరాత్ సొంతం చేసుకుంది.
35 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో తన ఐదో ఫ్రాంచైజీకి మారుతున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు అతడు సగం ధరకు, అంటే రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు బదిలీ అయ్యాడు.
ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ రికార్డులు
హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 సీజన్లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 124 మ్యాచ్‌ల్లో 8.92 ఎకానమీతో 151 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న నలుగురు బౌలర్లలో హర్షల్ కూడా ఒకడు. 2021లో ఆర్సీబీ తరఫున, 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.
అయితే గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడి ప్రదర్శన నిరాశపరిచింది. 2025లో 13 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 2026 సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయకుండా 10.82 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.
గుజరాత్ బౌలింగ్ విభాగానికి మరింత బలం
హర్షల్ పటేల్ రాకతో గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలింగ్ విభాగంలో మరో అనుభవజ్ఞుడైన బౌలర్ చేరాడు. ఇప్పటికే ఆ జట్టులో కగిసో రబడా, జేసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, అర్షద్ ఖాన్, అశోక్ శర్మ, ల్యూక్ వుడ్, ఇషాంత్ శర్మ, కుల్వంత్ ఖెజ్రోలియా వంటి పేసర్లు ఉన్నారు. ఇవాళ రిటెన్షన్, ట్రేడింగ్ గడువు ముగియనున్న నేపథ్యంలో గుజరాత్ ఇంకొంతమంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: IPL 2027: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్..!


