సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో నకిలీ వెండి వరఖ్ తయారీ దందా గుట్టును హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్రాంతాల్లోని నాలుగు తయారీ కేంద్రాలపై మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అల్యూమినియం రేకులు, నకిలీ సిల్వర్ ఫ్లేక్స్, ఇతర కల్తీ పదార్థాలతో పాటు తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో అసలు వెండికి బదులుగా చౌకైన అల్యూమినియంతో నకిలీ వెండి రేకులను తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వరఖ్‌ను కాజు కట్లీ వంటి స్వీట్లు, స్వీట్ పాన్‌లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో వినియోగించేలా తెలంగాణవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దాడుల్లో 49 బండిళ్ల నకిలీ వెండి రేకులు, 32 కవర్ల అల్యూమినియం ఫ్లేక్స్, నకిలీ వెండి పూత పూసిన చక్కెర గుళికలు, పొగాకు, ఖివామ్, ఇతర ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. మిక్సర్లు, ప్యాకింగ్ మెషిన్, తూకం యంత్రం సహా పలు పరికరాలను సీజ్ చేశారు.
ఈ వ్యవహారంపై చార్మినార్, హుస్సేనిఆలం, మొఘల్‌పురా, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదు చేశారు. ఆహార పదార్థాల్లో వినియోగించే వెండి వరఖ్‌లో 99.9 శాతం స్వచ్ఛమైన వెండి ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. నకిలీ అల్యూమినియం రేకుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: సోనియమ్మ ఆత్మలో తెలంగాణ లేదు: కేటీఆర్


