సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) షాక్ ఇచ్చింది. నిర్మాణ జాప్యం, అనుమతులు లేకుండా ప్రాజెక్టుల విక్రయాలు, ఫ్లాట్ల అప్పగింతలో వైఫల్యాలపై ఎనిమిది రియల్ ఎస్టేట్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులకు భారీగా నగదు తిరిగి చెల్లించాలని, జరిమానాలు, వడ్డీలు చెల్లించాలని స్పష్టం చేసింది.
మంచిరేవులలోని ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టుకు సంబంధించి సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షల జరిమానా విధించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మకాలు, బుకింగ్స్ చేపట్టవద్దని ఆదేశించింది. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ కొనుగోలుదారుకు రూ.17 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ రూ.41.85 లక్షలు రిఫండ్ చేయాలని ఆదేశించింది. వాసవి రియల్టర్స్ సంస్థ రూ.49.50 లక్షలపై 2025 ఫిబ్రవరి 7 నుంచి 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని రెరా స్పష్టం చేసింది. ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్ రూ.27.16 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
మియాపూర్‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను తిరిగి అప్పగించాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది. రూ.6.58 లక్షల బకాయిలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన వాదనను రెరా తిరస్కరించింది. బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ రూ.7 లక్షలు వడ్డీతో సహా, భువంతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.26 లక్షలు కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రెరా ఆదేశాలను అమలు చేయకపోతే సెక్షన్ 63 కింద అదనపు జరిమానాలు విధిస్తామని కూడా సంస్థలను హెచ్చరించింది.
ఇదీ చదవండి: సోనియమ్మ ఆత్మలో తెలంగాణ లేదు: కేటీఆర్


