సామూహిక సెలవుతో నిరసన తెలిపిన 1.72 లక్షల మంది ఉద్యోగులు
సీపీఎస్ రద్దు చేసీ ఓపీఎస్ అమలు చేయాలన్న డిమాండ్‌తో 33 జిల్లాల్లో ధర్మదీక్షలు
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 1.72 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్షల్లో పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన హామీని అమలు చేయాలని కోరుతూ జూలై 11న తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) జనజాగరణ యాత్ర ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా 80 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసింది. ఆగస్టు 23న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ సభ నిర్వహించింది. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దాంతో, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమానికి దిగారు.
హైదరాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఓపీఎస్ పునరుద్ధరణ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ తర్వాత సీపీఎస్ ఉద్యోగులకు నెలకు రూ.1,500 నుంచి రూ.5,218 మాత్రమే పెన్షన్ వస్తోందన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. 2004 నుంచి ఇప్పటివరకు సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు, ప్రభుత్వ వాటాలకు సంబంధించి దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు ఎన్‌పీఎస్ ట్రస్ట్ వద్ద ఉన్నాయని, సీపీఎస్ రద్దుతో ఈ నిధులు రాష్ట్రానికి అందుబాటులోకి వస్తాయన్నారు.
కాగా, జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు ధర్మదీక్షలు శాంతియుతంగా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, అధ్యయన కమిటీలో సంఘానికి ప్రాతినిధ్యం కలి్పంచడం, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) కమిటీలో స్థానం కల్పించడం, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయడం అనే నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.


