ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం స్పందన
ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ
సమ్మక్క సాగర్‌లో నీటి నిల్వకూ అంగీకారం
మంత్రి ఉత్తమ్‌తో కలిసి విష్ణుదేవ్ సాయితో భేటీ అయిన సీఎం రేవంత్
ఎల్‌నినోతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశంపై వివరణ
బరాజ్‌లో నీటి నిల్వకు, ప్రాజెక్టు అనుమతులకూ సహకరించాలని విజ్ఞప్తి
ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారానికి నిధులు చెల్లించేందుకు సిద్ధమని వెల్లడి
రాష్ట్రంలో సాగు, తాగునీటి భద్రతకు దోహదపడనున్న ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ నీటి అవసరాలు తీర్చుకునేందుకు గాను బరాజ్‌లో నీటిని నిల్వ చేయడానికీ అంగీకారం తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లిన సీఎం..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఎల్‌నినో పరిస్థితులతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. సమ్మక్క సాగర్ బరాజ్‌లో నీటి నిల్వకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బరాజ్ నిర్మాణం పూర్తయిందని వివరించారు.
అంతర్రాష్ట సహకారానికి ఆదర్శంగా నిలుస్తుంది..
సమ్మక్క సాగర్ అంశానికి పరిష్కారం లభిస్తే గోదావరి జలాల వినియోగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చర్చలు, శాస్త్రీయ అంచనాల ద్వారా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూనే స్థానికుల ప్రయోజనాలను కాపాడవచ్చని అన్నారు.
ముంపు అంశాల పరిశీలనకు, ఉమ్మడి సర్వేలు, వివరాల నిర్ధారణకు సహకరించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, జలవనరుల శాఖ, బీజాపూర్ జిల్లా అధికారులు, సాంకేతిక బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరే పరిష్కారాన్ని తెలంగాణ కోరుకుంటోందని స్పష్టం చేశారు. ముంపు ప్రభావంపై ఛత్తీస్‌గఢ్ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
సంబంధిత చట్టాలు, నిబంధనల మేరకు పరిహారం చెల్లించేందుకు, అవసరమైతే ఆ మొత్తాన్ని ముందుగానే జమ చేసేందుకు సిద్ధమని గతంలోనే పలుమార్లు తెలియజేశామన్నారు. ముంపు అంచనా, వివరాల నిర్ధారణకు అయ్యే ఖర్చునూ భరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అధికారుల బృందం పాల్గొన్నారు.
6.94 టీఎంసీలకు తగ్గిన నిల్వ సామర్థ్యం..
తొలిదశలో 50 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా, 22.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 2009లో ‘పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు’ను ప్రతిపాదించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) 2012 మార్చి 2న సూత్రప్రాయ సమ్మతి తెలిపింది. కంతనపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే 11,408 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు.
అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత ముంపును తగ్గించేందుకు బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని ములుగు జిల్లా తుపాకులగూడెంకు మార్చారు. పూర్తి నిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 83 మీటర్లకు, నిల్వ సామర్థ్యాన్ని 6.94 టీఎంసీలకు తగ్గించారు. స్థానికంగా పూజించే సమ్మక్క పేరుతో ఈ బరాజ్‌కు ‘సమ్మక్క సాగర్’ ప్రాజెక్టుగా 2020 ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది.
రూ.2 వేల కోట్లతో 2021లో బరాజ్ నిర్మాణం పూర్తైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాలు, రామప్ప–పాకాల అనుసంధాన వ్యవస్థ కింద 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు దీన్ని రూపొందించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా 32,563 ఎకరాలకు సాగునీరు అందించడం, మార్గమధ్యంలోని గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చడం కూడా ప్రాజెక్టు లక్ష్యాలు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, నల్లగొండ జిల్లాల పరిధిలోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
అనుమతులు కావాలంటే ఎన్‌ఓసీ తప్పనిసరి
సమక్క బరాజ్ డీపీఆర్‌కు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేళ్లుగా ప్రయత్నిస్తుండగా, ఛత్తీస్‌గఢ్ పరిధిలో ముంపు ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలని సీడబ్ల్యూసీ గతంలో పలుమార్లు తేల్చి చెప్పింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎన్‌ఓసీ జారీ అంశాన్ని నాన్చుతూ వస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2025 సెపె్టంబర్ 22న రాయ్‌పూర్‌లో, 2026 జూన్ 11న హైదరాబాద్‌లో, సెప్టెంబర్ 4న న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సమావేశమై చర్చించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ 2025 జనవరి 18, మార్చి 3, జూలై 14, సెప్టెంబర్ 14, డిసెంబర్ 13తో పాటు 2026 జూన్ 11న కూడా ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ సీఎంకు లేఖలు రాశారు. స్పందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముంపు ప్రభావంపై ఐఐటీ ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించింది. బరాజ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్ భూభాగం పరిధిలో 33 ఎకరాలు ముంపునకు గురవుతాయని తేలింది.
భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదు. ఈ సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. సమ్మక్క సాగర్ బరాజ్ నిర్మాణం పూర్తయింది. 83 మీటర్ల గరిష్ట పూర్తి స్థాయి నీటి మట్టంతో 6.94 టీఎంసీలను నిల్వ చేసుకోవడానికి బరాజ్‌ను నిర్మించారు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.


