భారత దేశంలో చాలామటుకు పెళ్లిళ్లలలో వధువే వరుడి ఇంటికి వెళ్తుంది. ఆడపిల్లలనే అత్తారింటికి సాగనంపడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ మన భారత్‌లోని ఒక తెగ అందుకు విరుద్ధంగా ఆచారం పాటిస్తుంది. అక్కడ మాతృస్వామ్యమే ఏలుతుండటం విశేషం. వంశం అనగానే తండ్రి నుంచి సంక్రమిస్తే అక్కడ మాత్రం తల్లి నుంచే సంక్రమిస్తుంది. తల్లి గోత్రం, ఆమె వారసత్వమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ తెగలో.
ఈ విచిత్ర ఆచారాన్ని పాటించేది ఖాసీలు అనే తెగ. ఇక్కడ వివాహ సంప్రదాయం అత్యంత భిన్నంగా ఉంటుంది. ఈ కమ్యూనిటీలో రెండు వేర్వేరు వంశాల మధ్య పెళ్లిళ్లు జరుగుతాయి. ఒకే వంశంలో వివాహం నిషిద్ధం. ఎందుకంటే వంశ సభ్యులందరూ ఒకే పూర్వీకురాలైన తల్లికి పుట్టిన వారసులుగా పరిగణిస్తారు. ఈ కమ్యూనిటీల వివాహ వేడుకల్లో ఇరువైపుల ప్రతినిధులుగా మేనమామలే పాల్గొంటారు.
వరుడు అతని బంధువులు వధువు ఇంటికి వెళ్తారు. ఆక్కడ వివాహం జరిపించడానికి లాంఛనప్రాయంగా కొన్ని వస్తువులు మార్చుకుంటారు. ఆ తర్వాత భర్త భార్యతో కలసి అత్తారింట్లో నివశించడం అక్కడ ఆనవాయితీ. అంటే ఇక్కడ భర్తే భార్య కుటుంబంలో భాగమవుతాడు. అలాగే ఈ తెగలో ఇంటి పేరును తర్వాతి తరాలకు ఇచ్చేంది స్త్రీలే. తన తల్లిదండ్రుల బాధ్యతలను, వారసత్వాన్ని కొనసాగించేది కుమార్తేలే. ఒకవేళ ఆమెనే కుటుంబంలో చిన్న కుమార్తె అయితే భర్తనే వచ్చి తన ఇంట్లో నివశించడం తోపాటు..వారసత్వ బాధ్యతలను కూడా ఆమెనే తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే పూర్వీకులు భూమికి సంరక్షకురాలిగా మారడమే కాకుండా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూడా ఆమెదే. ఒకవేళ ఇంట్లో పెళ్లికాకుండా తోబుట్టువులు ఉండిపోతే వారిని చూసుకోవాల్సింది కూడా ఆమెనే. ఈ ఆచారాన్ని ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం..వేరొక కాపురం పెట్టాలనే ఆలోచనకు అడ్డుకట్ట వేస్తూ..అంత ఐక్యంగా ఉండేలా చేయడమేనని ఆ తెగ ప్రజలు చెబుతుండటం విశేషం.
అలాగని పురుషులకు ఎలాంటి పాత్ర ఉండదని కూడా అర్థం కాదట. కుటుంబాన్ని నిర్వహించడం, పిల్లల పోషణ తదితరాలన్నీ అతడే నిర్వర్తిస్తాడు. కాకపోతే వారసుడిగా కాకుండా వారుసురాలికే ప్రాధాన్యత ఇవ్వడమే విశేషం. సింపుల్‌గా చెప్పాలంటే మాతృస్వామ్య పాలన అని చెప్పొచ్చు.
ఇదీ చదవండి: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి మైక్రోగ్రీన్స్ వ్యాపారం..! నెలకు రూ. 5 లక్షలు పైనే..


