సాక్షి, వరంగల్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తాజాగా స్పందించారు. సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ అధిష్ఠానం తగిన దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని, పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని పేర్కొన్నారు.
వరంగల్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలో కొందరు కావాలనే డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ప్రజలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందని చెప్పారు. అనేక సర్వేల ఫలితాల ఆధారంగానే పరకాల సభలో ముఖ్యమంత్రి తన పేరును ప్రకటించారని తెలిపారు.
పచ్చ కాంగ్రెస్.. తెల్ల కాంగ్రెస్ అంటూ ఏమీ లేదు..
కాంగ్రెస్ పార్టీలో ‘పచ్చ కాంగ్రెస్.. తెల్ల కాంగ్రెస్’ అంటూ వర్గాలు ఏమీ లేవని రేవూరి స్పష్టం చేశారు. తాను అయినా, మంత్రి అయినా పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేయాల్సిందేనని అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీలో ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు ఉంటే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే, పరకాలలో జరిగిన సభకు మంత్రి కొండా సురేఖను తాను ఆహ్వానించానని రేవూరి తెలిపారు. అయితే ఆమె సభకు ఎందుకు హాజరుకాలేదో తనకు తెలియదని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఏ ప్రోటోకాల్ ఉంటుందన్న అంశంపైనా స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొనడం సరికాదన్నారు.
సీఎం ప్రకటనతో మరింత బాధ్యత
తాను సమర్థవంతంగా పనిచేస్తున్నందుకే తనకు అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పరకాల సభలో తన పేరును ప్రకటించడం తనపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు.
సుస్మిత వ్యాఖ్యల కలకలం..
ఇదిలా ఉండగా.. అంతకుముందు కొండా సుస్మితా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. అయితే, కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.


