తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారిని వైఎస్సార్‌సీపీ పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ఈ రెండున్నరేళ్లలో పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా, గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన వాటి ముందు నిలబడి చంద్రబాబు ఫోజులు ఇస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడటం ఒక్కేటే చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పేదలకు ఇళ్లు రాకుండా కేసులు వేయించింది చంద్రబాబేనని, ఇప్పుడు తానే చేసినట్లు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘ వైఎస్ జగన్ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల చేతిలో లక్ష కోట్ల ఆస్తి పెట్టారు. పేదలకు ఇళ్లు రాకుండా చంద్రబాబు కేసులు వేయించారు. వెయ్యికి పైగా కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి జగన్ పేదలకు ఆస్తి ఇచ్చారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క ఇంటి స్థలమైనా ఇచ్చారా?, వైఎస్ జగన్ ప్రారంభించిన మిగతా ఇళ్లనైనా పూర్తి చేశారా?, వైఎస్ జగన్ చేసిన ఇళ్ల ముందు నిలబడి చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బుర్రిపాలెం తీసుకొచ్చారు. వ్యవసాయ మంత్రిని తీసుకొచ్చి రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడనివ్వలేదు?, రాష్ట్రంలో 388 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. ఇలాంటి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి ఎందుకు మాట్లాడలేదు?, చౌహాన్ పర్యటనను కూడా జగన్‌పై విమర్శలకే వాడుకుంటారా?, జగన్‌ను తిట్టడమే కూటమి ప్రభుత్వ అజెండానా?, నాదెండ్ల మనోహర్‌కు జగన్‌ను విమర్శించే అర్హత ఉందా?
సీజ్ ద షిప్’ ఎపిసోడ్‌పై నాదెండ్ల మనోహర్ విచారణకు సిద్ధమా?, జగన్ తెచ్చిన నవరత్నాలు, సంక్షేమ పథకాలను అటకెక్కించారు. రైతు కన్నీళ్లు పెడుతుంటే.. చంద్రబాబు ప్రచారాలు చేసుకుంటున్నారు. అమరావతిలో జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్లను అడ్డుకున్నది చంద్రబాబే. అమరావతి అందరిదంటారు.. పేదలకు పట్టాలిస్తే అడ్డుకుంటారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. ఎన్నికలంటే వైఎస్సార్‌సీపీకి భయం లేదు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా?, అచ్చెన్నాయుడు గ్రామాల్లోకి వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బీసీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.. రమేష్ యాదవ్


