సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి బీసీలను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయంగా కుల గణన పూర్తిచేసి బీసీల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ రోజు వైఎస్సాఆర్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కుల గణన ఆధారంగా తమిళనాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్లకు కేంద్రంలో చట్టసవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. జగన్ హయాంలో బీసీలకు 40–45 శాతం పదవులు ఇచ్చాం. బీసీ రిజర్వేషన్లు రద్దయినా వైఎస్ జగన్ సాధారణ స్థానాల్లో బీసీలకు అవకాశాలు కల్పించారు. వైఎస్సార్సీపీ హయాంలో 11 రాజ్యసభ స్థానాల్లో 4 బీసీలకు ఇచ్చాం. టీడీపీ హయాంలో 9 రాజ్యసభ స్థానాల్లో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. చంద్రబాబు తన క్యాబినెట్‌లో ఒక్క బీసీకి కూడా డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు..? అని రమేష్ యాదవ్ ప్రశ్నించారు.
20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ హామీపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో బీసీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ యాదవ్ తప్పుబట్టారు. శ్రీకృష్ణుడు, వాల్మీకి, మొల్ల, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల సేవలను గుర్తుచేశారు. బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణ యాదవ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.


