సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆఫీసులో ఇండి కూటమి నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై వివాదాల నేపథ్యంలో CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండి కూటమి ఆధ్వర్యంలో ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నామని తదనంతరం 8వ తేదీన ఛలో లోక్‌భవన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని నేతలంతా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్‌తో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈసీకీ మరోషాక్ తగిలింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం (2006లో) ఆయనపై నమోదైన ఓ ఆత్మహత్య కేసుకు సంబంధించి కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నాటి కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.


