సాక్షి, నెల్లూరు జిల్లా: మనుబోలులో 19 గ్రామపంచాయతీల వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కాకాణి దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంపై నేతలు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని అధికారులను కాకాణి కోరారు.
పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేసిన కాకాణి.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే చట్టపరంగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీకి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, పారదర్శక సేవలు అందించాల్సిందేనని కాకాణి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి


