సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే అభ్యంతరాలను పట్టించుకోకుండా బీఫామ్ లేకుండానే టీడీపీ నేతకు ఎంపీపీ పదవి కట్టబెట్టారనే వివాదం నెలకొంది.
పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి టీడీపీ నేతకు ఎంపీపీ పదవి ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫామ్ లేకుండా ఎంపీపీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగారు. జనసేన ఎమ్మెల్యే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా టీడీపీ నేతకు పదవి కట్టబెట్టడంతో పూసపాటిరేగలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామం కూటమి పార్టీల మధ్య విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది.
మరోవైపు.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల పంపకంలో జనసేనకు టీడీపీ భారీ షాకిచ్చింది. తొమ్మిది జెడ్పీ చైర్మన్ పదవులు ఇవ్వాలని జనసేన కోరగా.. కేవలం నాలుగింటితోనే సరిపెట్టుకోవాలని టీడీపీ తేల్చిచెప్పింది. జనసేనకు అంత బలం లేదన్నట్లుగా నాలుగు స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ తీరుపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
జెడ్పీ చైర్మన్ పదవుల రొటేషన్‌ను చివరి వరకు సాగదీసిన కూటమి పెద్దలు.. ఎన్నికలకు కొన్ని గంటల ముందు గురువారం అర్ధరాత్రి జిల్లాల వారీగా పదవుల కేటాయింపులను ప్రకటించారు. మొత్తం 27 జెడ్పీ చైర్మన్ పదవుల్లో టీడీపీ 22 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. జనసేనకు నాలుగు, బీజేపీకి ఒకటి కేటాయించింది. జనసేనకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జెడ్పీ చైర్మన్ పదవులు దక్కాయి. బీజేపీకి కృష్ణా జిల్లా కేటాయించారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవుల పంపకంలో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 ఇచ్చారు.
ఇదీ చదవండి: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు..


