సరిగ్గా 60 ఏళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మొదటిసారిగా చంద్రుని కక్ష్య నుంచి భూమిని ఫొటో తీసింది. ఇది మానవుని సాంకేతిక విజయానికి ప్రతీక. మనిషి తొలిసారి తన ‘ఇంటి’ని బయట నుంచి చూసిన చిత్రం ఇది. ఆ దృశ్యంలో భూమి చిన్నదిగా కనిపించింది. కానీ ఆ చిన్న బిందువులోనే మన చరిత్ర, నాగరికతలు, యుద్ధాలు, ప్రేమలు, విజయాలు, వైఫ ల్యాలు, సముద్రాలు, అడవులు, నగరాలు– మనిషికి తెలిసిన మొత్తం ప్రపంచం ఉంది. మనిషికి తన మాతృభూమిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చిన ఫొటో ఇది.
మనిషి ఆకాశం వైపు చూసినప్పటి నుంచి చంద్రుడు అతనికి ఒక అద్భుతం. శతాబ్దాల పాటు చంద్రుడిని దేవతలతో, పురాణా లతో, కవిత్వంతో అనుసంధానించాడు. కాలక్రమంలో తన విజ్ఞా నంతో దానిపైనే అడుగుపెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే 1966 ఆగస్టు 23న జరిగిన ఆ సంఘటన అంతరిక్ష చరిత్రలో చోటుచేసుకుంది. ఆ రోజు నాసాకు చెందిన లూనార్ ఆర్బిటర్–1 చంద్రుడి సమీప కక్ష్య నుంచి భూమిని చిత్రీకరిం చింది. అందులో చంద్రుడి ఉపరితలం మీదుగా చిన్న పరిమాణంలో భూమి కనిపిస్తూ ఉంది.
నిజానికి లూనార్ ఆర్బిటర్–1 ప్రధాన లక్ష్యం భూమిని ఫొటో తీయడం కాదు. అమెరికా ‘అపోలో కార్యక్రమం’ ద్వారా మనిషిని చంద్రుడిపైకి పంపేందుకు సిద్ధమవుతోంది. చంద్రునిపై ఎక్కడ దిగితే సురక్షితం? ఎక్కడ రాళ్లు, గోతులు ఎక్కువగా ఉన్నాయి లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదకడానికి ‘లూనార్ ఆర్బిటర్’ కార్యక్రమం మొదలైంది. లూనార్ ఆర్బిటర్–1ను 1966 ఆగస్టు 10న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ నుంచి ప్రయోగించారు. ఆగస్టు 14న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అదేచంద్రుడిని చేరిన తొలి అమెరికా అంతరిక్ష నౌక.
కాకతాళీయం
చంద్రుడి ఉపరితలాన్ని చిత్రీకరించేందుకు దానిలో ప్రత్యేక కెమెరా వ్యవస్థ ఉంది. కెమెరా తీసిన ఫిల్మ్‌ను అంతరిక్ష నౌకలోనే ప్రాసెస్ చేసి, స్కాన్ చేసి, డేటాను రేడియో సంకేతాల రూపంలో భూమికి పంపే విధానం అప్పట్లో ఆ నౌకలో ఉపయోగించారు. అయితే ఆగస్టు 23న లూనార్ ఆర్బిటర్–1 చంద్రుడి అవతలి వైపు నుంచి బయటకు వస్తున్న సమయంలో చంద్రుడి అంచున భూమి కనిపించింది. అంతరిక్ష నౌకను తాత్కాలికంగా మరో దిశలో తిప్పి భూమిని చిత్రీకరించాలా అనే చర్చ భూమిపై ఉన్న శాస్త్రవేత్తల్లో జరిగింది. అప్పటి అంతరిక్ష నౌకల నియంత్రణ నేటిలా కచ్చి
తంగా ఉండేది కాదు. నౌకను తిప్పితే తిరిగి సరైన దిశలోకి తీసుకురావడం కష్టమయ్యే ప్రమాదం ఉంది. అయినా మిషన్ నియంత్రణ కేంద్రం ఆ అవకాశాన్ని వదులుకోలేదు. చిత్రం నాసా ట్రాకింగ్ స్టేషన్‌కు చేరింది. స్పెయిన్‌లోని రొబ్లెడో డి చావెలా కేంద్రంలో ఆ సంకేతాలను అందుకున్నారు. అది మానవ చరిత్రలో ఒక కొత్త దృశ్య శకానికి ఆరంభం.
ఆ చిత్రంలో భూమి ఒక చిన్న ప్రకాశవంతమైన అర్ధచంద్రా కారంగా కనిపిస్తోంది. దాని వెనుక విశాలమైన అంతరిక్షం కింద చంద్రుడి బూడిదరంగు ఉపరితలం! ఈ ఫోటోను శాస్త్ర వేత్తలు ‘ఫ్రేమ్–17’గా వ్యవహరిస్తారు. భూమిపై అనేక చరాచర జీవులు, దేశాలు, ఖండాలు... ఎన్ని ఉన్నా అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఇవేవీ కనిపించవు. ఒక చిన్న గోళంగా మాత్రమే భూమి దర్శనమిస్తుంది. ఇదే ఆ చిత్రం ఇచ్చిన సందేశం.
ఇదీ చదవండి: ఫోటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్
ఈ కథలో మరో ఆసక్తికరమైన అధ్యాయం ఉంది. 1966లో ఆ చిత్రాన్ని అందుకున్నప్పటికీ, అప్పటి సాంకేతిక పరిమితుల వల్ల పూర్తి స్థాయి హైరిజల్యూషన్ రూపంలో దాన్ని నిల్వ చేయడం సాధ్యం కాలేదు. అయితే నలభై ఏళ్లకు పైగా గడిచిన తర్వాత నాసా పాత మాగ్నెటిక్ టేపులు, 1960ల కాలం నాటి పరికరాలు, ఆధునిక డిజిటల్ సాంకేతికతను కలిపి డేటాను మళ్లీ ప్రాసెస్ చేసింది. ఫలితంగా 2008లో మెరుగైన రూపంలో ఆ చారిత్రక చిత్రం ప్రపంచానికి అందింది. ఒక ప్రయోగం ముగిసినా దాని డేటా విలువ ఎప్పటికీ ముగియదనీ, తరువాతి కాలంలో అందుబాటులోకి వచ్చే కొత్త సాంకేతికతతో తిరిగి పరిశీలిస్తే కొత్త విషయాలు బయటపడవచ్చనీ ఇది నిరూపించింది.
-ఎడిటోరియల్ టీమ్
ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?


