నీట్‌ పేపర్‌ లీక్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. అధికారులపై కేసు లేదా? | Government NTA officials may not be named in CBI charge sheet | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీక్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. అధికారులపై కేసు లేదా?

Oct 4 2026 9:08 AM | Updated on Oct 4 2026 9:08 AM

Government NTA officials may not be named in CBI charge sheet

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ- 2026 ప్రశ్నపత్రం లీక్‌ కేసులో సీబీఐ తన రెండో, తుది ఛార్జ్‌షీట్‌ను మరో వారంలో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి చెందిన ఏ అధికారి పేరును నిందితునిగా చేర్చే అవకాశం లేదని దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తుల పాత్ర మాత్రమే నిర్ధారణ అయిందని, ప్రభుత్వ అధికారుల ప్రమేయానికి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు.

13 మంది పాత్ర మాత్రమే గుర్తింపు
ఈ కేసులో ఇప్పటివరకు 13 మంది పాత్రను మాత్రమే సీబీఐ నిర్ధారించగలిగింది. వీరిలో ఎన్టీఏ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్‌ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులు, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఉన్నారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిన పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఇంతవరకే దర్యాప్తు పరిమితం కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారినీ, ఎన్టీఏ అధికారులనూ తుది ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా చేర్చం. లీక్‌ జరిగిన పరిస్థితులపై దర్యాప్తు చేసినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు మినహా మరెవరిపైనా ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించలేదు’ అని ఓ అధికారి తెలిపినట్లు ‘హిందుస్థాన్‌ టైమ్‌’ పేర్కొంది. మరో అధికారి మాట్లాడుతూ.. దీంతో నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు పూర్తవుతుందని చెప్పారు.

కామన్ ప్రశ్నలతో వెలుగులోకి లీక్‌
మే 3న నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించగా.. మే 12న ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సబ్జెక్ట్ నిపుణులు, ఉపాధ్యాయులు గత ప్రశ్నపత్రాల ధోరణులు, నమూనాలను పరిశీలించి రూపొందించిన ఓ ‘గెస్ పేపర్‌’లోని కనీసం 120 ప్రశ్నలు అసలు నీట్‌ ప్రశ్నపత్రంతో సరిపోలినట్లు గుర్తించారు. పరీక్ష జరిగిన వారం తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరిగాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అనంతరం అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే పేపర్ లీక్‌ వెనుక ఎన్టీఏ, విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండవచ్చని పరీక్షకు హాజరైన కొందరు అభ్యర్థులు ఆరోపించారు. అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తొలి ఛార్జ్‌షీట్‌లో 13 మంది
జూలై 28న సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అందులో 13 మంది నిందితుల పేర్లను చేర్చింది. వారిలో ఎన్టీఏ నియమించిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారు. బోటనీ, జువాలజీకి మనీషా గురునాథ్ మాంధారే, కెమిస్ట్రీకి ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణి, ఫిజిక్స్‌కు మనీషా సంజయ్ హవాల్దార్ ఉన్నారు. అయితే ‘ఇతర కుట్రదారుల’ పాత్రపై దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు అప్పట్లో సీబీఐ తెలిపింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌), గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ క్వశ్చన్డ్ డాక్యుమెంట్స్ (జీఈక్యూడీ), ఢిల్లీ యూనివర్సిటీ నిపుణుల నివేదికల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అనంతరం కోచింగ్‌ సెంటర్ల ద్వారా లీకైన ప్రశ్నపత్రం వల్ల ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది.

తుది ఛార్జ్‌షీట్‌లో ముగ్గురి పాత్ర..
తుది ఛార్జ్‌షీట్‌లో ఈ ముగ్గురి పాత్రతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల నివేదికల్లోని అంశాలను కూడా పొందుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఎన్టీఏ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేశామని, అయితే అలాంటి ప్రమేయం బయటపడలేదని చెప్పారు.

సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ ప్రకారం.. 
నీట్‌ యూజీ 2026 ప్రశ్నపత్రం తయారీకి సంబంధించిన పలు దశల్లో ఎన్టీఏ అదే ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులను పదేపదే ఉపయోగించింది. వారిలో ఒక నిపుణుడు ప్రశ్నల రూపకల్పన నుంచి వాటి అనువాదం వరకు మొత్తం నాలుగు దశల్లో పాల్గొన్నారు. చివరి దశలో ఈ నిపుణులకు పరీక్షకు సంబంధించిన నాలుగు మాస్టర్ ప్రశ్నపత్రాలనూ చూసే అవకాశం లభించింది.

ప్రశ్నలను బయటకు తీసుకెళ్లినట్లు..
సీబీఐ ఆరోపణల ప్రకారం.. కెమిస్ట్రీ నిపుణుడు కులకర్ణి 135 కెమిస్ట్రీ ప్రశ్నలను వాటి సమాధానాల ఎంపికలతో సహా చిన్న కాగితాలపై రాసి, వాటిని రహస్య ప్రదేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. మాంధారే, హవాల్దార్ కూడా ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరాలను గుర్తుపెట్టుకుని, అనంతరం పాఠ్యపుస్తకాల సహాయంతో వాటిని తిరిగి రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్లను సీబీఐ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని నిబంధనలను కూడా ప్రయోగించింది. కేసుకు మద్దతుగా 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 భౌతిక ఆధారాలను సీబీఐ సమర్పించింది.

ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను తమకు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐని కోరినట్లు గత నెలలో ‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపింది. మనీలాండరింగ్ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందా అనే అంశాన్ని పరిశీలించేందుకే ఈ రికార్డులను కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

ఎన్టీఏలో భారీ మార్పులు
పేపర్‌ లీక్‌ వ్యవహారం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో భారీ మార్పులు చేపట్టింది. ఆగస్టు 17న కేంద్ర విద్యాశాఖ 50 మంది ఎన్టీఏ సిబ్బందిని తొలగించింది. అనంతరం పరీక్షల విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించి, కొత్త నిపుణులను నియమించింది. ప్రశ్నపత్రాల పరిశీలనకు నాలుగు దశల విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి: బాబా వంగా vs ఆర్థిక సంస్థలు.. ‘బంగారం’పై ఏది సత్యం?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement