న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నీట్‌లో ఇంటర్మీడియట్ (12వ తరగతి) బోర్డు పరీక్షల మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. నందన్ నీలేకని నేతృత్వంలోని పరీక్షల సంస్కరణల టాస్క్‌ఫోర్స్‌తో నిర్వహించిన సంప్రదింపుల సమావేశాల్లో ఈ ప్రతిపాదన ప్రధానంగా చర్చకు వచ్చినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది.
ప్రస్తుతం వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్‌లో ఒకే పరీక్షపై ఆధారపడటం వల్ల కోచింగ్ సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. విద్యార్థులు బోర్డు పరీక్షల కంటే కోచింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని పేర్కొన్నాయి. పదో తరగతి పూర్తయిన వెంటనే కొందరు విద్యార్థులు డమ్మీ కళాశాలల్లో చేరి, పూర్తిగా కోచింగ్ సంస్థలపైనే ఆధారపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఏడాదికి ఒకటి కంటే ఎక్కువసార్లు నీట్ నిర్వహించాలని పలు రాష్ట్రాలు సూచించాయి. దీనివల్ల విద్యార్థులకు మరో అవకాశం లభించడంతో పాటు ఒకే పరీక్ష ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుందని అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతున్న నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా మార్చాలని దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు మద్దతు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు సూచించాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించాలని కోరాయి. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాల రూపకల్పన చేయకుండా, పరీక్షలకు దగ్గర సమయంలో ప్రశ్నలను సిద్ధం చేయడం, కేంద్ర పరీక్షా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి సూచనలు కూడా వచ్చాయి.
జులై 25న జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించారు. నందన్ నీలేకని నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, ఒడిశాతో సమావేశాలు నిర్వహించింది. త్వరలో ఉత్తరాది రాష్ట్రాలతోనూ చర్చలు జరపనుంది. తొలి రెండు నెలల్లో 18 ఉన్నతస్థాయి సమావేశాలు, 40 సంప్రదింపుల సమావేశాలు నిర్వహించిన ఈ కమిటీకి తొలుత అక్టోబర్ వరకు గడువు ఉండగా, తాజాగా జనవరి 2027 వరకు పొడిగించారు. ఇప్పటివరకు సుమారు 50 వేల సూచనలు అందినట్లు సమాచారం.
ఇదీ చదవండి: అమెరికాలో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్!


