సచిన్‌ను ఔట్ చేసిన యువరాజు విలియం
స్కూల్ బాలికలతో మాటామంతీ
కటింగ్ టీ బాగుందంటూ యువరాణి మెచ్చుకోలు
ముంబై: రాచరికపు మర్యాదలు, రాజకీయాల నుంచి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, యువరాణి కేథరీన్‌లకు ‘ముంబై’లో ఆటవిడుపు లభించింది. 2026 ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’కార్యక్రమం కోసం మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఈ జంట.. సోమవారం ఉదయం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, బడికెళ్లే అమ్మాయిలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకొట్టులో మట్టిపాత్రలో యువరాజు, యువరాణి టీ సేవించారు. బ్రిటిష్ కాలపు కట్టడాల్లో కలియదిరిగి చరిత్రను ఒక్కసారి నెమరేసుకున్నారు. చివరాఖరుగా.. ఆధునిక ముంబైకి ప్రతీకగా నిలిచే మెట్రో రైలు ప్రయాణమూ కానిచ్చారు.
ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేథరీన్‌ల ఈ ఆట విడుపునకు ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్ మొరార్జీ రోడ్డు వేదికగా నిలిచింది. ఈ ప్రాంతం మొత్తం యూకే రాజు కింగ్ ఎడ్వర్డ్ పాలన కాలం (1901 – 1910) నాటి నిర్మాణశైలితో కట్టిన భవనాలుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో మహారాష్ట్ర సంప్రదాయ వాద్య బృందం ‘ఢోల్ తాషా’శబ్ధాలు జోరుగా వినిపిస్తూండగా.. యువరాజు, యువరాణిలు ఇన్‌స్టా్రగామ్ పేజీ ‘గల్లీ క్రికెట్’సభ్యులతో సరదాగా క్రికెట్ ఆడారు తారురోడ్డుపై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ స్టంపుల ముందు విలియం ప్లాస్టిక్ బ్యాట్‌తో స్టాన్స్ తీసుకోగా.... నాలుగు బాల్స్ ఎదుర్కొని, ఐదో బంతికి బౌల్డ్ అయ్యారు. ఆసక్తికరంగా ప్రిన్స్ విలయం తన బౌలింగ్‌తో సచిన్‌ను క్యాచ్ ఔట్ చేశారు. యువరాణి కూడా దాదాపు రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఎనిమిదో బంతికి భర్త చేతిలో ఔట్ అయ్యారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ప్రిన్స్ గతంలో ఎప్పుడో ఓవల్ మైదాన్‌లో క్రికెట్ ఆడారని, ఇప్పుడు ఆయనకు గల్లీ క్రికెట్ పరిచయమైందని వ్యాఖ్యానించారు.
అంతకుముందు సచిన్, రాజదంపతులు కలిసి ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసిన స్టాల్‌లో మట్టికుండలో టీ తాగారు. క్రికెట్ తరువాత అతిథులు విధాన్ భవన్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో నిర్వహించిన ‘ఎర్త్ షాట్ ప్రైజ్ – 2026’ఇంపాక్ట్ అసెంబ్లీకి మెట్రో రైల్‌లో ప్రయాణించి చేరుకున్నారు. ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యావరణ పురస్కారం. దీనిని 2020లో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రముఖ శాస్త్రవేత్త డేవిడ్ అటెన్‌బరో ప్రారంభించారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ పురస్కారం ఉద్దేశం. పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేసే 5 మందికి ఒక్కొక్కరికీ సుమారు రూ.
10 కోట్లు పైగా గ్రాంటు లభిస్తుంది.
గల్లీ క్రికెట్‌లో పాల్గొన్న సాహెర్ కోఖ్రా మాట్లాడుతూ యువరాజు, యువరాణులతో క్రికెట్ ఆడటం తనకు దక్కిన గౌరవం అని అన్నారు. వారిద్దరూ ఎలాంటి భేషజాలు లేకుండా బాగా పలుకరించారని చెప్పారు. అయితే తాను అంతకంటే ఎక్కువ సంతోíÙంచింది సచిన్ తనముందే ప్రఖ్యాతిగాంచిన స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టడమూ, అతడి ఆటోగ్రాఫ్ తీసుకోవడమేనని సంబరపడింది. ప్రిన్స్ కేథరీన్ క్యాచ్‌ను పట్టుకున్న అనంద్ భట్ (గల్లీ క్రికెట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ) మాట్లాడుతూ యువరాణి తన క్యాచ్‌ను ప్రశంసించారని చెప్పారు. బల్లార్డ్ ఎస్టేట్ సమీపంలోనే టీ కొట్టు ఉన్న బెహ్రూలాల్ చౌదరీ, మనోజ్ ఠాకూర్‌లు దంపతులకు టీ చేసివ్వడం విశేషం. ‘‘సచిన్‌ను ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. యువరాణి కూడా టీ బాగుందని, ‘‘ఇట్ వాస్ లవ్లీ’’అని వ్యాఖ్యానించారు’’అని ఠాకూర్ తెలిపారు. 2016 ఏప్రిల్ తర్వాత, యువరాజు విలియం, యువరాణి కేథరీన్‌లు భారత్ రావడం ఇది రెండోసారి. ఈ రాజ దంపతులు బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు.


