సాక్షి, హైదరాబాద్: మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రెనోవా మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ (ఎంఎస్‌ఎల్) తొలి సీజన్‌లో రేజింగ్ బుల్స్ జట్టు విజేతగా అవతరించింది. హైదరాబాద్ శివార్లలోని ప్రైమ్ ఎరీనాలో జరిగిన ఫైనల్లో రేజింగ్ బుల్స్ మూడు వికెట్ల తేడాతో సన్‌క్రెస్ట్ వారియర్స్‌పై నెగ్గింది. తొలుత సన్‌క్రెస్ట్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
రామ్ పాటిల్ 40 పరుగులతో రాణించాడు. రేజింగ్ బుల్స్ కెప్టెన్ హరీష్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం రేజింగ్ బుల్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పవన్ చెరుకూరి (47), అబిద్ అజహరుద్దీన్ (41) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నీరజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’... హరీష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు లభించాయి.
ఎంఎస్‌ఎల్‌కు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన లభించడంతో వచ్చే ఏడాది నుంచి ఏటా రెండు సీజన్లను నిర్వహిస్తామని ఎంసీఏహెచ్ అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏహెచ్ సహాయ కార్యదర్శి గువ్వల బాలరాజు, ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి సునీల్ రెడ్డి, కోశాధికారి రాంబాబు, ఈసీ సభ్యులు రమణ, రాకేశ్, పవన్, సన్నీ, బీజేపీ నాయకుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


