ప్రశ్నపత్రాల వెల్లడితో సమగ్రత ఎలా దెబ్బతింటుంది?
ఎన్‌బీఈఎంఎస్‌ని ప్రశ్నించిన సుప్రీం
సమగ్ర అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబుల కీలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచితే పరీక్షల సమగ్రత, పవిత్రతకు విఘాతం ఏవిధంగా కలుగుతుందో తెలపాలని సుప్రీంకోర్టు సోమవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్)ను ఆదేశించింది. నీట్–పీజీ ఆన్సర్ కీ, జవాబు పత్రాలను వెల్లడించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్యార్థులు తమ సమాధానాలను సరిచూసుకునేందుకు, మూల్యాంకనం కచ్చితత్వాన్ని సొంతంగా నిర్ధారించుకునేందుకు ప్రస్తుత విధానం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ల న్యాయవాదులు తెలిపారు. ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాలు అడిగితే ఎన్‌బీఈఎంఎస్ కేవలం ముక్తసరి సమాధానాలే చెబుతోందని నివేదించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేలా వివరాలు ఇవ్వడం లేదన్నారు. భవిష్యత్తులో జరిగే పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం ప్రామాణిక విధివిధానాలను (ఎస్‌ఓపీ) కచ్చితంగా అమలు చేయాలని కోరారు. అయితే, నీట్–పీజీ కంప్యూటర్ ఆధారిత బహుళైచి్ఛక ప్రశ్నల (ఎంసీక్యూ) పరీక్ష అని, ఇందులో భౌతిక జవాబు పత్రాలు ఉండవని బోర్డు గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రస్తావించారు.
ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీలు అత్యంత గోప్యమైనవని, వాటిని బయటపెట్టడం కుదరదని బోర్డు వాదిస్తోంది. పరీక్షలో పునర్‌మూల్యాంకనం (రీవాల్యుయేషన్) చేసే విధానం లేనందున సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కూడా ఈ వివరాలు అడిగే హక్కు అభ్యర్థులకు లేదని ఎన్‌బీఈఎంఎస్ చెబుతూ వస్తోంది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అసలు ఆన్సర్ కీలను వెల్లడిస్తే పరీక్షల సమగ్రతకు ఏ రకంగా భంగం వాటిల్లుతుందో కచ్చితమైన ఆధారాలతో తెలియజేయాలని ఎన్‌బీఈఎంఎస్‌ను ఆదేశించింది. జాతీయ స్థాయి పరీక్షల్లో పారదర్శకత తప్పనిసరి అని స్పష్టం చేసిన న్యాయస్థానం.. అభ్యర్థులు చేస్తున్న డిమాండ్లపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకోనుంది.


