ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో చంద్రబాబుకు మద్దతిచ్చిన రామోజీ
దేశానికి సేవలందించిన మహానాయకులకు లేని గౌరవం రామోజీకా?
సాక్షి, అమరావతి: ఆయనేమీ ప్రజా సేవకుడు కాదు. ప్రజాప్రతినిధిగానూ పనిచేయలేదు. ఆయనో వ్యాపారవేత్త. ఓ పత్రికాధిపతి కూడా. ఆయనే చెరుకూరి రామోజీరావు. అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏటా నవంబర్ 16న రామోజీ జయంతిని రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించాల్సిందిగా సచివాలయంలోని అన్ని శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖలు తమకు కేటాయించిన బడ్జెట్ నుంచి భరించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
దేశానికి, రాష్ట్రానికి సేవలందించిన మహానాయకులకు లేని గౌరవాన్ని ప్రైవేట్ వ్యాపారస్తుడైన రామోజీరావుకు చంద్రబాబు కల్పించడం పట్ల అధికార యంత్రాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి గానీ.. దేశానికి గానీ ఎటువంటి సేవలను రామోజీరావు అందించలేదని, తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు కృషి చేశారని, అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రభుత్వం నిర్వహించడం, ఇందుకు ప్రభుత్వ నిధులను వెచ్చించడం అనేది తప్పుడు సంప్రదాయం అవుతుందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.
ఇలా రుణం తీర్చుకుంటున్నారా!
రామోజీ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం ద్వారా ఆయన రుణాన్ని సీఎం చంద్రబాబు తీర్చుకుంటున్నట్టుందని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రామోజీరావు పూర్తి మద్దతుగా నిలిచారని, అంతేకాకుండా అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్టీఆర్‌ను ఆ పదవి నుంచి దింపేసి.. ఆ పదవిలో చంద్రబాబును కూర్చోబెట్టడంలో రామోజీ పూర్తిగా సహకరించారని, అందుకే ఇప్పుడు ఆయన జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.
ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడంలోనూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడంలోనూ రామోజీ రాజగురువుగా చంద్రబాబుకు వెన్నంటి ఉన్నారని అధికార యంత్రాంగం గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రామోజీ సంస్మరణ సభను, ఇప్పుడు ఆయన జయంతిని చంద్రబాబు ప్రభుత్వ నిధులతో నిర్వహించడం ద్వారా రుణం తీర్చుకుని ఉంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సంస్మరణ సభకు సర్కారు నిధులు
రామోజీరావు సంస్మరణ సభకు కూడా చంద్రబాబు సర్కారు 2024లో ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.4.28 కోట్లు వ్యయం చేసింది. పత్రికా వ్యాపారవేత్తకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభ నిర్వహించి రూ.కోట్లు వ్యయం చేయడంపై అప్పట్లోనే అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేసింది.
9 మందికి ప్రతిభ పురస్కారాలు
కాగా.. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ ఏడాదికి 9 మందికి ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఊచల విక్రయం


