విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఊచల విక్రయం | Fake 550D TMT Bars Flood Market with Vizag Steel Logos | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఊచల విక్రయం

Nov 17 2026 5:28 AM | Updated on Nov 17 2026 5:28 AM

Fake 550D TMT Bars Flood Market with Vizag Steel Logos

వైజాగ్‌ స్టీల్‌ లోగోలతో మార్కెట్‌లోకి నకిలీ టీఎంటీ 550డీ బార్స్‌  

ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు దుకాణాల్లో అమ్మకం  

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ప్రైవేట్‌ రోలింగ్‌ మిల్స్‌ దందా

సాక్షి, విశాఖపట్నం: ఓవైపు ప్రైవేటీకరణ పక్కలో బల్లెంలా ఉంటే.. ఇప్పుడు నకిలీ బ్రాండ్స్‌ విశాఖ ఉక్కుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ తయారు చేసే అత్యంత నాణ్యమైన వైజాగ్‌ టీఎంటీ 550డీ బార్స్‌ పేరుతో మార్కెట్లో నకిలీ బార్స్‌ చలామణి అవుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల ఉత్పత్తి తగ్గి మార్కెట్లో ఏర్పడిన కొరతను అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కి చెందిన కొన్ని ప్రైవేటు రోలింగ్‌ మిల్లులు ‘వైజాగ్‌ 550డి టీఎంటీ’ లోగోను పోలిన ముద్రలతో నాసిరకం స్టీల్‌ను ఉత్పత్తి చేసి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు మార్కెట్లకు తరలిస్తున్నాయి.

ముఖ్యంగా 8 ఎంఎం సైజు గల నకిలీ ఊచలు భారీగా విక్రయిస్తున్న విషయాన్ని సీఐటీయూ వంటి ఉక్కు కారి్మక సంఘాలు గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో విశాఖ ఉక్కు సంస్థ రా్రïÙ్టయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. నిర్మాణంలో భవనానికి వెన్నెముక వంటి ఇనుప ఊచల్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే వాడాలని, ఆ ప్రమాణాలకు ఏమాత్రం తూగని ఈ నకిలీ ఊచలను వాడటం వల్ల భవనాల పటిష్టత, మన్నిక దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించింది.

నాసిరకం స్టీల్‌కు తగినంత సాగే గుణం (డక్టిలిటీ), బలం ఉండవని, అందువల్ల భూకంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో కట్టడాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు.

తక్కువ ధరకు వస్తున్నాయనో, అసలైన బ్రాండ్‌ అని మోసపోయో వీటిని వాడితే భవిష్యత్తులో భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  

అసలైన వైజాగ్‌ స్టీల్‌ను  గుర్తించడమెలా? 
దేశంలోనే తొలి తీరప్రాంత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ అయిన విశాఖ ఉక్కు కర్మాగారం 100 శాతం స్వచ్ఛమైన వర్జిన్‌స్టీల్‌తో ఈ ఊచలను తయారు చేస్తుంది. అత్యాధునిక టెంప్‌కోర్‌ టెక్నాలజీతో తయారయ్యే వీటి బయటిపొర అత్యంత దృఢంగా, లోపలి భాగం మెత్తగా ఉండి సులభంగా వంచడానికి (బెండింగ్‌), వెల్డింగ్‌ చేయడానికి అనువుగా ఉంటుంది. సాధారణ గ్రేడ్‌ స్టీల్‌తో పోలిస్తే 550డి గ్రేడ్‌ వాడటం వల్ల నిర్మాణంలో 10 నుంచి 15 శాతం వరకు స్టీల్‌ ఆదా అవుతుంది.

అందుకే పోలవరం ప్రాజెక్టు, మెట్రోరైలు, విమానాశ్రయాలు, అణువిద్యుత్‌ కేంద్రాలు వంటి ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఈ గ్రేడ్‌నే వినియోగిస్తారు. కొనుగోలుదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోయే ప్రమాదం ఉన్నందున స్టీల్‌ కొనేముందే కొన్ని కీలక అంశాలను పరిశీలించాలని మార్కెటింగ్‌ విభాగాధికారులు సూచిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో తయారైన అసలైన ఊచలపై ప్రతి మీటరుకు స్పష్టంగా వైజాగ్‌ టీఎంటీ 550డీ అని ఇంగ్లి‹Ùలో ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటుంది.

అలాగే స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఉత్పత్తులపై వైజాగ్‌ ఉక్కు అని ఇంగ్లి‹Ùలో ముద్ర ఉంటుంది. నకిలీ ఊచలపై ఈ అక్షరాలు అస్పష్టంగా లేదా కేవలం పెయింట్‌తో వేసినట్లు ఉంటాయని చెబుతున్నారు. అసలైన స్టీల్‌ కొనుగోలు చేసిన డీలర్ల వద్ద కచ్చితంగా మిల్‌టెస్ట్‌ సర్టీఫికెట్‌ (ఎంటీసీ) ఉంటుందని, దాన్ని అడిగి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

నకిలీ వెబ్‌సైట్లపై  ఫిర్యాదుకు.. 
కేవలం నకిలీ ఇనుప ఊచలే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. తక్కువ ధరకు వైజాగ్‌ స్టీల్‌ సరఫరా చేస్తామని ఆశచూపి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి అడ్వాన్సులు వసూలు చేసి మోసం చేస్తున్న ఘటనలు విశాఖపట్నం, శ్రీకాకుళంలో వెలుగుచూశాయి.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు కేవలం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా వినియోగదారులు తమకు కావాల్సిన స్టీల్‌ను కేవలం ఆర్‌ఐఎన్‌ఎల్‌ గుర్తింపుపొందిన అ«దీకృత డీలర్లు, బ్రాంచ్‌ సేల్స్‌ ఆఫీసుల ద్వారానే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్స్‌తో పాటు నకిలీ ఊచలు విక్రయిస్తున్న సంస్థలపైనా ఫిర్యాదుల చేసేందుకు ప్లాంట్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement