దూసుకొస్తున్న ‘ఆక్వాన్‌’ | Cyclone Akvan set to get stronger: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న ‘ఆక్వాన్‌’

Nov 17 2026 5:46 AM | Updated on Nov 17 2026 5:46 AM

Cyclone Akvan set to get stronger: Andhra Pradesh

రాష్ట్రానికి మరో తుపాను గండం 

20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం 

గంటకు120–145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు 

19, 20 తేదీల్లో కోస్తాలో అత్యంత భారీ వర్షాలు

సాక్షి, అమరావతి:  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం తుపానుగా బలపడింది. దీనికి ‘ఆక్వాన్‌’గా నామకరణం చేశారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను సోమవారంరాత్రి చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660, విశాఖపట్నానికి 670, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం సాయంత్రానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది.

పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుంది. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.  ఈ తుపాను అతి తీవ్ర స్థాయిలో తీరాన్ని తాకనుంది. తీరం దాటే ప్రాంతం నెల్లూరు నుంచి తుని వరకు దాదాపు 450 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం ఉండనుంది. 

గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు .. 
బుధవారం నుంచి కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు మొదలవుతాయి. ఆ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం కూడా ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పిడుగులు పడతాయని పేర్కొంది. 

వేటకు వెళ్లొద్దు ... 
గురువారం సాయంత్రం నుంచి సముద్రం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుందని తెలిపే ఒకటో నంబర్‌ హెచ్చరిక ఎగురవేశారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నంబర్‌తో పాటు ఇంకా ఎక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే  
తుపాను వల్ల ఏ సమస్య ఎదురైనా మన మిత్ర వాట్సాప్‌ నంబర్‌ 95523 00009కు సమాచారం ఇవ్వవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. అత్యవసర సహాయానికి 112, 1070, 1800 425 0101 టోల్‌ ఫ్రీ నంబర్లను 
సంప్రదించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement