3 నెలలుగా జీతాలు చెల్లించని సెక్యూరిటీ యాజమాన్యం
వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ అడిగినందుకు వేధింపులు
ముగ్గురు మహిళా గార్డుల విధులు నిలిపివేత
పట్టించుకోని ఆస్పత్రి అధికారులు..ఆందోళనలో సిబ్బంది
మహారాణిపేట: విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో మహిళా సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను వేధిస్తోందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. వేతనాలతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని అడిగినందుకు ముగ్గురు మహిళా గార్డులకు సోమవారం నుంచి విధులు కేటాయించకుండా నిలిపివేసినట్లు తెలిపారు.
ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సంతోషి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందన లేదని సీఐటీయూ జగదాంబ జోన్ కార్యదర్శి చంద్రశేఖర్ మండిపడ్డారు. జీతాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కొంతమంది సెక్యూరిటీ గార్డులు సీఐటీయూ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న ముగ్గురు మహిళా గార్డులను సోమవారం విధులకు రావద్దని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని సూపర్‌వైజర్ చెప్పినట్లు చంద్రశేఖర్ తెలిపారు.
దీంతో మనస్తాపానికి గురైన కార్మికులు సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఇతర సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. అయినా ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీ యాజమాన్యం స్పందించకపోవడంతో సంతోషి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 3,4 రోజులుగా ముగ్గురు మహిళా కార్మికులు సెక్యూరిటీ కార్యాలయం ఎదుట జీతాల కోసం ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రశేఖర్ ఆరోపించారు.
ఈ విషయంపై ఆస్పత్రి అధికారులను ప్రశ్నిస్తే తాము ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని చెబుతున్నారని తెలిపారు. ముగ్గురు మహిళా కార్మికులకు విధులు కేటాయించకుండా కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ.18,600 వేతనం చెల్లించడంతోపాటు ప్రతి కార్మికుడికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు.
రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విధులకు అనుమతించడం లేదని, పనిచేస్తున్న వారికి సైతం సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అడిగినందుకు యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గత నెలలోనూ సెక్యూరిటీ సిబ్బందిపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యం మరింతగా వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.


