అన్నదాతకు ఆక్వాన్‌ కలవరం | cyclones arnab and murasu damaged crops on 13 lakh hectares in andhra | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆక్వాన్‌ కలవరం

Nov 17 2026 5:54 AM | Updated on Nov 17 2026 5:54 AM

cyclones arnab and murasu damaged crops on 13 lakh hectares in andhra

వరుస తుపానుల దెబ్బకు 13 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఇంకా కొలిక్కిరాని పంట నష్టం తుది అంచనాలు 

పైసా విదల్చని చంద్రబాబు సర్కార్‌ 

ప్రస్తుతం 53.30 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు.. మరో 6.37 లక్షల ఎకరాల్లో రబీ పంటలపై ప్రభావం 

రెండు నెలలుగా పూట గడవక అలమటిస్తున్న మత్స్యకారులు

సాక్షి, అమరావతి: ఓ వైపు తీవ్రమైన కరువు.. మరోవైపు వరుస తుపానుల దెబ్బకు కకావికలమైన అన్నదాతలను ఆక్వాన్‌ రూపంలో దూసుకొస్తున్న మరో తుపాను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరువు నేపథ్యంలో సాగునీటి ఎద్దడికి ఎదురొడ్డి సాగుచేసిన కొద్దిపాటి పంటలను వరుస తుపానులు నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్‌ పంటలనే కాదు.. రబీ పంటలపైనా తుపానులు తీవ్ర ప్రభావం చూపిస్తుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.  

కరువుకు తోడు వరుస విపత్తులు 
సెపె్టంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పంటలు కొంతమేర దెబ్బతినగా.. పంట చేతికొచ్చే దశలో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపానులు అన్నదాతల ఆశలను చిదిమేశాయి. తుపానుల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో గోస్తనీ నది ఉప్పొంగగా.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలువ, కొవ్వాడ కాలువ, గోస్తనీ కాలువలు పొంగి పొర్లడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. నేటికీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటపొలాలు ముంపునీరు దిగకపోవడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా నీటిలో నానుతూ కుళ్లిపోతున్నాయి. 

రెండు తుపానులు.. రూ.3,208 కోట్ల ఉత్పత్తి నష్టం 
ప్రాథమిక లెక్కల ప్రకారం అర్నబ్‌ తుపాను ప్రభావానికి 15 జిల్లాల పరిధిలో దాదాపు 6 లక్షలమంది రైతులకు చెందిన 9.38 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా.. రూ.2,392.84 కోట్ల మేర పంటల ఉత్పత్తికి (9.78 లక్షల టన్నులు) నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఈ తుపానుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.815.57కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.714.96 కోట్ల మేర చెల్లించాలని అంచనా వేశారు.

 మురసు తుపాను దెబ్బకు 8 జిల్లాల్లో 1.87 లక్షలమంది రైతులకు చెందిన మరో 3.57 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోగా.. రూ.816.53 కోట్ల (3.38 లక్షల టన్నులు) మేర ఉత్పత్తి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఈ తుపానుకు దెబ్బతిన్న రైతులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.321.64 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.266.67 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని అంచనా వేశారు. అర్నబ్‌ తుపానుకు సంబంధించి పంట నష్టం 
తుది అంచనాలు కొలిక్కి వచ్చినప్పటికీ మురసు నష్టం తుది అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. 

ఆక్వాన్‌తో గుండె గుభేల్‌ 
నేటికీ 53.30 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు చేలల్లోనే ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు 6.37 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగయ్యాయి. వీటిలో 34 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో కంది, 4.8 లక్షల ఎకరాల్లో పత్తి, సాగులో ఉన్నాయి. వీటితోపాటు 16 జిల్లాల్లో 6.75 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో ప్రధానంగా 2.71 లక్షల ఎకరాల్లో మిరప, 2.46 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 61వేల ఎకరాల్లో పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయ పంటలున్నాయి.

ముఖ్యంగా తీర ప్రాంతంలోని 10 జిల్లాల్లో 23.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉండగా.. వాటిలో 23 లక్షల ఎకరాలు వరి పంట ఉంది. కోతకు సిద్ధమైన వరితో పాటు మొక్కజొన్న, పత్తి తదితర పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వాన్‌ తుపాను రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ తుపాను ఈ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. 

రెండు నెలలుగా వేటలేక మత్స్యకారుల విలవిల 
రాష్ట్రంలో 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 555 గ్రామాల్లో 8 లక్షల మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్నారు. ఇప్పటికే 30,635 బోట్లు తీరంలోనే ఉన్నాయి. కేవలం 173 మెకనైజ్డ్‌ బోట్లు మాత్రమే సముద్రంలో ఉన్నాయి. వీటిని కూడా తీరానికి చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వేటకు వెళ్లకూడదంటూ మత్స్యకారులకు వాయిస్‌ మెసేజిలు పంపిస్తున్నారు. వరుస తుపానుల దెబ్బకు బోట్లన్నీ తీరంలో లంగరేయడంతో మత్స్యకారులకు పూట గడవని పరిస్థితి నెలకొంది.

ఆక్వాన్‌ తుపాను హెచ్చరికలు వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా వేటకు వెళ్లక పస్తులతో వారి కుటుంబాలు అలమటిస్తున్నాయి. తుపానుల ప్రభావంతో ముంపునకు గురైన వారికి మాత్రమే అరకొరగా నిత్యావసర సరుకులు ఇస్తున్న ప్రభుత్వం తమను మాత్రం పట్టించుకోవడంలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం 
వరుస తుపానులతో రైతులు, మత్స్యకారులు కుదేలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు కరువు ప్యాకేజీలతో పాటు పంట నష్ట పరిహారాలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుంటే.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరువు మండలాలను ప్రకటించడం, తుపానులు తీరం దాటగానే పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు ఇవ్వడమే తప్ప సొంతంగా పైసా కూడా సాయం విదిలి్చన పాపానపోవడం లేదు. నవంబర్‌ మూడో వారం వచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే ఇందుకు నిదర్శనం. అర్నబ్, మురసు తుపానులకు రంగు మారిన, ముక్కలైన ధాన్యం కొనే నాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement