బాబా వంగా vs ఆర్థిక సంస్థలు.. ‘బంగారం’పై ఏది సత్యం? | Gold Prices May Surge in 2027 Amid Global Cash Crisis | Sakshi
Sakshi News home page

బాబా వంగా vs ఆర్థిక సంస్థలు.. ‘బంగారం’పై ఏది సత్యం?

Oct 4 2026 8:28 AM | Updated on Oct 4 2026 8:28 AM

Gold Prices May Surge in 2027 Amid Global Cash Crisis

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలను దాటుతుంగా ... 2027లో మరింత భారీగా పెరగనున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. బల్గేరియన్ భవిష్యవేత్త బాబా వంగా పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం లేదా నగదు కొరత ఏర్పడితే సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గి, పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లే అవకాశం ఉందట. అయితే బాబా వంగా నిజంగా ఈ అంచనా వేశారనేందుకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేవు. మరోవైపు ప్రముఖ ఆర్థిక సంస్థలు మాత్రం 2027లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలపై తమ  అంచనాలను వెల్లడించాయి.

బాబా వంగా పేరుతో ..
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న కొన్ని కథనాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చని బాబా వంగా అంచనా వేసినట్లు చెబుతున్నారు. అయితే వీటిని నిర్ధారించే ప్రామాణిక రికార్డు ఏదీ లేదు. బాబా వంగా తన జోస్యాలను రాతపూర్వకంగా నమోదు చేసినట్లు ఆధారాలు లేవని, ఆమె అంచనాలను పరిశీలించిన పలు వర్గాలు పేర్కొంటున్నాయి.

రూ.2.82 లక్షలకు చేరుతుందంటూ..
ఆన్‌లైన్‌లోని కొన్ని నివేదికలు 2027లో భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల వరకు చేరవచ్చని పేర్కొంటున్నాయి. మరో అంచనా ప్రకారం 10 గ్రాముల ధర సుమారు రూ.2.1 లక్షలకు చేరవచ్చని చెబుతున్నారు. అయితే ఇవి ఆర్థిక సంస్థలు ప్రకటించిన అధికారిక ధరల అంచనాలు కావు. బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న జోస్యానికి అనుసంధానించిన ఊహాగానాలు మాత్రమే. అందువల్ల వీటిని ఖచ్చితమైన మార్కెట్ అంచనాలుగా పరిగణించకూడదు.

జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం..
బంగారం ధరలపై ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా తమ అంచనాలను వెల్లడించాయి. జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాలుగో త్రైమాసికంలో బంగారం సగటు ధర ఔన్సుకు 6,000 డాలర్లు, అంటే 10 గ్రాములకు సుమారు 2,116.44 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా. 2027 చివరి నాటికి ఔన్సుకు 6,300 డాలర్లకు, అంటే 10 గ్రాములకు సుమారు 2,222 డాలర్లకు పెరగవచ్చని పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు, ద్రవ్యోల్బణం ముప్పు, కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతాయని తెలిపింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, అంతర్జాతీయ ఘర్షణల పరిణామాలపై ఈ అంచనా ఆధారపడి ఉంటుందని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది.

యూబీఎస్, డాయిష్ బ్యాంక్ అంచనాలివే..
యూబీఎస్ కూడా 2027 తొలి అర్ధభాగంలో బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లకు చేరువ కావచ్చని అంచనా వేసింది. ఇది 10 గ్రాములకు సుమారు 1,763.70 డాలర్లు లేదా భారత కరెన్సీలో రూ.1.69 లక్షల స్థాయికి సమానం. మరోవైపు డాయిష్ బ్యాంక్ 2026 నాలుగో త్రైమాసికానికి ఔన్సుకు 4,600 డాలర్ల లక్ష్యాన్ని కొనసాగించింది. ఇది 10 గ్రాములకు సుమారు 1,622.60 డాలర్లు లేదా రూ.1.55 లక్షల స్థాయికి సమానం. సెప్టెంబర్‌లో వెలువడిన విశ్లేషణను గుర్తుచేస్తూ ట్రేడింగ్‌వ్యూ ఈ వివరాలను పేర్కొంది.

బాబా వంగా ఎవరు?
బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా డిమిట్రోవా. 1911లో జన్మించిన ఆమె బల్గేరియాకు చెందిన అంధ భవిష్యవేత్త. మూలికా వైద్యురాలిగా ప్రసిద్ధి చెందారు. ఆమె జీవితానికి సంబంధించిన కథనాల ప్రకారం.. 12 ఏళ్ల వయసులో సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత చూపును కోల్పోయారు. అనంతరం ఆమె చెప్పిన జోస్యాల్లో 9/11 దాడులు, చెర్నోబిల్ విపత్తు, ప్రిన్సెస్ డయానా మరణం, 2004 హిందూ మహాసముద్ర సునామీ, బ్రెగ్జిట్, ఐసిస్ ఎదుగుదల వంటి ఘటనలు ఉన్నాయి. వీటిలో దాదాపు 85 శాతం నిజమయ్యాయని కొందరు చెబుతున్నప్పటికీ.. ఈ వాదనకు  ఎటువంటి ధ్రువీకరణ లేదు. 

ఇదీ చదవండి: ఫిరోజ్‌పూర్‌ ఘటన: పాక్‌ దౌత్యవేత్తకు చివాట్లు పెట్టిన భారత్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement