ఫిరోజ్‌పూర్‌ ఘటన: పాక్‌ దౌత్యవేత్తకు చివాట్లు పెట్టిన భారత్‌! | India summons Pakistan Charged Affaires over Ferozepur incident | Sakshi
Sakshi News home page

ఫిరోజ్‌పూర్‌ ఘటన: పాక్‌ దౌత్యవేత్తకు చివాట్లు పెట్టిన భారత్‌!

Oct 4 2026 7:57 AM | Updated on Oct 4 2026 7:57 AM

India summons Pakistan Charged Affaires over Ferozepur incident

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన విషయంలో పాకిస్థాన్‌ తీరుపై భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లకు పాకిస్థాన్‌ నుంచి కొనసాగుతున్న సహకారాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఛార్జ్‌ డి అఫైర్స్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి, నిరసన వ్యక్తం చేసింది.

అక్టోబర్‌ 2న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ పూర్తిగా తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవి, ఉద్దేశపూర్వకమైనవని స్పష్టం చేసింది. సరిహద్దు వెంబడి అక్రమంగా చొరబడే ప్రయత్నాలను పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. భారత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు సరిహద్దు కంచె సమీపంలో భారత భూభాగంలోకి ప్రవేశించారు. వారిని తిరిగి పాకిస్థాన్‌ వైపు వెళ్లాలని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పలుమార్లు హెచ్చరించారు. అయితే వారు హెచ్చరికలను పట్టించుకోకుండా కంచె వైపు ముందుకు కదిలారు. దీంతో వారు తక్షణ భద్రతా ముప్పుగా మారడంతో బీఎస్‌ఎఫ్‌ వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని భారత వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్‌ వైపు నుంచి పనిచేస్తున్న సాయుధ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల కార్యకలాపాల్లో భాగంగానే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ముఠాలు అంతర్జాతీయ సరిహద్దును అనధికారికంగా దాటేందుకు గతంలోనూ పలుమార్లు ప్రయత్నించాయని తెలిపింది. ముఖ్యంగా చీకటి సమయాల్లో సరిహద్దు దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించింది. సరిహద్దు చొరబాట్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పాకిస్థాన్‌ దర్యాప్తు చేయాలని భారత్‌ కోరింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ సరిహద్దు భద్రతా బలగాల ప్రమేయం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. అక్రమ చొరబాట్లు, డ్రగ్స్‌ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరింది.

ఇదీ చదవండి: Canada: ఆరుగురితో వెళ్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌ గల్లంతు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement