ఆర్థిక సంక్షోభం.. చేతులు మారిన ఇళ్లు.. | Robert Kiyosaki Reveals 2008 Financial Crisis Made the Rich Richer homes changed hands | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభం.. చేతులు మారిన ఇళ్లు..

Nov 15 2026 9:38 PM | Updated on Nov 15 2026 9:40 PM

Robert Kiyosaki Reveals 2008 Financial Crisis Made the Rich Richer homes changed hands

ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి 2008 ఆర్థిక సంక్షోభం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షోభ సమయంలో లక్షలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయినా.. ఆ ఇళ్లు మాయమైపోలేదని, కేవలం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారాయని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం సమయంలో సాధారణ ప్రజలు ఆస్తులు అమ్ముకుంటే.. పెట్టుబడిదారులు తక్కువ ధరలకు వాటిని కొనుగోలు చేసి సంపదను పెంచుకున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు.

2008 సంక్షోభం కారణంగా సుమారు 60 లక్షల ఇళ్లపై జప్తు ప్రక్రియ జరిగిందని, ఇళ్ల ధరలు 30 శాతం వరకు పడిపోయాయని కియోసాకి గుర్తుచేశారు. ఈ సమయంలో పెద్ద పెట్టుబడిదారులు సుమారు 3,600 కోట్ల డాలర్లు వెచ్చించి 2 లక్షల జప్తు చేసిన ఇళ్లను కొనుగోలు చేశారని తెలిపారు. మధ్యతరగతి ప్రజల సంపద 39 శాతం తగ్గితే.. అగ్రశ్రేణిలోని 20 శాతం మంది సంపద 13 శాతం పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం 11 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి కాలేదని, ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయిందని వ్యాఖ్యానించారు.

ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగాలపై, నెలవారీ జీతాలపై ఆధారపడేవారు ముందుగా నష్టపోతారని కియోసాకి విశ్లేషించారు. ఆదాయం తగ్గినా ఇల్లు, కారు రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు మాత్రం ఆగవని తెలిపారు. చిన్న వ్యాపారాలు అప్పులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ఆ తర్వాత బ్యాంకులు రుణాలివ్వడానికి వెనుకాడతాయని వివరించారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్థిక వ్యవస్థలోకి నగదును ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించిందని, ప్రపంచ కుబేరుల సంపద ఏకంగా 70 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు. జీతంపై ఆధారపడటం కంటే ఆస్తుల నుంచి నిరంతర నగదు ప్రవాహాన్ని (క్యాష్ ఫ్లో) సృష్టించుకోవడం ముఖ్యమని సూచించారు. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండకుండా.. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసే స్థాయిలో ఆర్థికంగా సిద్ధంగా ఉండాలని అన్నారు. తదుపరి ఆర్థిక సంక్షోభంలో ఆస్తులను అమ్ముకునే వారిలో ఉంటారా? లేక తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా? అని తన పోస్టు ద్వారా ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement