నేటి రోజుల్లో చాలా మంది ఒకటి ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లను వినియోగిస్తున్నారు. ఒకటి ప్రధానంగా వినియోగించే నంబర్ కాగా మరొకటి పెద్దగా రీచార్జ్ చేయకుండా కేవలం ఓటీపీల కోసం ఉపయోగిస్తుంటారు. ఇలా సెకండరీ సిమ్‌గా జియో కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నవారు లేదా రీఛార్జ్ చేయకుండా ఎక్కువ కాలం అలాగే ఉంచుతున్నవారి కోసమే ఈ అలర్ట్!
ఎక్కువకాలం వినియోగంలో లేని కొన్ని జియో నంబర్లకు ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సేవలు నిలిచిపోతున్నట్లు వినియోగదారులు ఆన్‌లైన్‌లో వెల్లడిస్తున్నారు. ఇలాంటి నంబర్లకు 'క్రిటికల్ సస్పెన్షన్' హెచ్చరికలు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే కేవలం రూ.11తో డేటా వోచర్ రీఛార్జ్ చేసి, కొద్దిసేపు ఇంటర్నెట్ ఉపయోగించడం ద్వారా సేవలను తిరిగి పొందినట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు.
90 రోజుల తర్వాత డీయాక్టివేట్ చేసేస్తారా?
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను కనీసం 90 రోజుల పాటు రీచార్జ్ చేయనంత మాత్రాన డీయాక్టివేట్ చేయకూడదు. ఈ వ్యవధిలో వాయిస్ లేదా వీడియో కాల్స్ (ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్), ఔట్‌గోయింగ్ ఎస్‌ఎంఎస్‌లు, మొబైల్ డేటా వినియోగం వంటి కార్యకలాపాలు జరిగినా దాన్ని వినియోగంగానే పరిగణిస్తారు. ఒక వేళ ఆ నంబర్‌పై రూ.20 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ విధానం ద్వారా ప్రతి 30 రోజులకు రూ.20 వరకు మినహాయించుకుని నంబర్‌ను కొనసాగించే వెసులుబాటు ఉంది.
జియో నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జియో అధికారిక వెబ్‌సైట్‌లోని నిబంధనల ప్రకారం.. వరుసగా 90 రోజులు ఎలాంటి వినియోగం లేని ప్రీపెయిడ్ నంబర్‌ను కంపెనీ డీయాక్టివేట్ చేయవచ్చు. ఖాతాలో రూ.20 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ విధానం అమలవుతుంది. డీయాక్టివేట్ అయిన నంబర్‌ను తిరిగి పొందేందుకు 15 రోజుల గడువులో రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన రీ-కేవైసీ, రీఛార్జ్ నిబంధనలు కూడా వర్తిస్తాయి.
మరోవైపు, రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కనీసం 15 రోజుల పాటు ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయని జియో ప్రీపెయిడ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వాటిని ఎప్పుడైనా నిలిపివేసే అవకాశం కంపెనీకి ఉంది. చివరి రీఛార్జ్ గడువు ముగిసిన 180 రోజుల తర్వాత నంబర్‌ను డీయాక్టివేట్ చేసే అధికారం కూడా జియోకు ఉంది.
రూ.11 రీఛార్జ్‌తో తిరిగి యాక్టివేట్ అవుతుందా?
ఇటీవల కొందరు జియో వినియోగదారులు తమ అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. రూ.11 డేటా వోచర్‌ను రీఛార్జ్ చేసి, ఆ తర్వాత సిమ్‌లో మొబైల్ డేటాను ఆన్ చేసి కొద్దిసేపు ఇంటర్నెట్ ఉపయోగించడంతో నిలిచిపోయిన ఇన్‌కమింగ్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ వోచర్ ద్వారా గంటపాటు అపరిమిత డేటా లభిస్తుంది. నెట్‌వర్క్‌లో డేటా వినియోగం నమోదవడం వల్ల నంబర్‌పై ఉన్న ఇన్‌యాక్టివ్ సమస్య తొలగి ఉండవచ్చని వారి అభిప్రాయం. అయితే, రూ.11 రీఛార్జ్‌తో ప్రతి సస్పెండ్ అయిన నంబర్ తిరిగి యాక్టివేట్ అవుతుందని జియో ప్రకటించలేదు. అంతేకాకుండా ఈ వోచర్ స్వతంత్రంగా నంబర్ వ్యాలిడిటీని పొడిగించే ప్లాన్ కాదు.
ఇదీ చదవండి: ఒకేసారి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. జియో సెన్సేషన్!


