ఓలా స్కూటర్లు అమ్మేందుకు కొత్త ప్లాన్‌.. | Ola Electric closing stores Bhavish Aggarwal new plan sell e-scooters | Sakshi
Sakshi News home page

షోరూమ్‌లన్నీ మూసేసి.. ఓలా స్కూటర్లు అమ్మేందుకు కొత్త ప్లాన్‌..

Nov 15 2026 3:41 PM | Updated on Nov 15 2026 4:08 PM

Ola Electric closing stores Bhavish Aggarwal new plan sell e-scooters

ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఓలా ఎలక్ట్రిక్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకు సొంత షోరూమ్‌ల ద్వారా నేరుగా కస్టమర్లకు వాహనాలను విక్రయించిన సంస్థ.. ఇకపై డీలర్ల ఆధారిత విక్రయ వ్యవస్థకు మారుతోంది. ఇందులో భాగంగా కంపెనీ నిర్వహిస్తున్న డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ (D2C) స్టోర్లలో నవంబర్ 1 నుంచి కొత్త ఆర్డర్ల స్వీకరణ నిలిపివేసింది. చాలా వరకు సొంత అవుట్‌లెట్లను డిసెంబర్ నాటికి మూసివేయాలని నిర్ణయించింది. వాటి స్థానంలో స్వతంత్ర డీలర్ల ద్వారా విక్రయాలు, పంపిణీ, సర్వీసింగ్‌ కార్యకలాపాలను విస్తరించనుంది.

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ప్రకారం.. ప్రస్తుతం కంపెనీకి డిమాండ్ సమస్య లేదు. ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలోనే ప్రధాన సవాళ్లు ఉన్నాయి. నవంబర్ 8 నాటికి 255 మంది డీలర్ భాగస్వాముల ద్వారా 319 స్టోర్లను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 450కి, 2027 మార్చి నాటికి 700కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీలర్ల నుంచి రిపీట్‌ ఆర్డర్లు పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ వాటా కూడా మెరుగుపడుతోందని సంస్థ పేర్కొంది.

పడిపోతున్న వాహన రిజిస్ట్రేషన్లు

మరోవైపు కంపెనీ చెబుతున్న డిమాండ్‌కు, మార్కెట్ గణాంకాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ 41,653 వాహనాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 19.5 శాతం తక్కువ. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినా రిజిస్ట్రేషన్లు 5.3 శాతం తగ్గాయి. క్యూ2లో కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.421 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.690 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. నికర నష్టం రూ.362 కోట్లుగా నమోదైంది.

ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యం

సొంత షోరూమ్‌ల నిర్వహణ నుంచి తప్పుకోవడం ద్వారా మరో రూ.50 కోట్ల మేర నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవచ్చని ఓలా అంచనా వేస్తోంది. క్యూ2లో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.369 కోట్లుగా ఉన్నాయి. డీలర్ మోడల్‌లో వాహనాల నిల్వ బాధ్యత కూడా డీలర్లపైనే ఉండటంతో వర్కింగ్ క్యాపిటల్‌పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. మరోవైపు 2024 డిసెంబర్‌లో రూ.3,132 కోట్లుగా ఉన్న మొత్తం రుణాలు 2026 సెప్టెంబర్ నాటికి రూ.1,819 కోట్లకు తగ్గాయి.

సరఫరా సమస్యలపై దృష్టి

వాహనాల ఉత్పత్తిని పెంచడంలో సరఫరాదారుల నుంచి ఎదురవుతున్న ఆలస్యాలు ప్రధాన అడ్డంకిగా మారాయని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌లో సుమారు 5,000 వాహనాలకు చెల్లింపులు పూర్తయినా, ఛార్జర్ల కొరత కారణంగా డెలివరీలు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ నాటికి నెలకు 25,000 వాహనాల ఉత్పత్తి స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 6 గిగావాట్‌ అవర్‌ బ్యాటరీ సెల్ తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2027 నాలుగో త్రైమాసికం నుంచి ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ సెల్స్‌ను స్కూటర్లలో వినియోగించాలని యోచిస్తోంది.

మొత్తంగా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల ద్వారా విక్రయాలను పెంచడం, బ్యాటరీ తయారీలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ఓలా భావిస్తోంది. అయితే తగ్గుతున్న వాహన రిజిస్ట్రేషన్లను కొత్త డీలర్ వ్యవస్థ ఎంతవరకు అధిగమిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌లో కీలక మార్పులు రాబోతున్నాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement