ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. బెంగళూరులో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఏథర్ కొనార్క్ (Konarc)ను ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే. కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కొనార్క్.. ఏథర్ ప్రస్తుత 450 సిరీస్‌కు భిన్నంగా మాస్ మార్కెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ప్రారంభ ధర రూ.99,999
కొనార్క్‌ను ఏథర్ రెండు లైన్లలో మొత్తం ఆరు వేరియంట్లలో తీసుకురానుంది. ఇందులో S లైన్‌లో 100, 125, 161, 200 కి.మీ. IDC రేంజ్ వేరియంట్లు, Z లైన్‌లో 125, 161 కి.మీ. వేరియంట్లు ఉంటాయి. ప్రస్తుతం S లైన్‌లోని మూడు వేరియంట్ల ధరలను ప్రకటించింది.
కొనార్క్ ఎస్ 100 (Konarc S 100) ధర : రూ.99,999
కొనార్క్ ఎస్ 125 (Konarc S 125) ధర : రూ.1,21,999
కొనార్క్ ఎస్ 161 (Konarc S 161) ధర : రూ.1,44,999
ఇవి బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధరలు. 200 కి.మీ. వెర్షన్, Z లైన్ వేరియంట్ల ధరలను ఏథర్ తర్వాత ప్రకటించనుంది.
161 కి.మీ. వరకు రేంజ్..
ప్రస్తుతం విక్రయానికి సిద్ధమైన S 100, S 125, S 161 వేరియంట్లు వరుసగా 100, 125, 161 కి.మీ. IDC రేంజ్ అందిస్తాయి. అయితే కంపెనీ పేర్కొన్న ట్రూ రేంజ్ వరుసగా సుమారు 80, 100, 130 కి.మీ.గా ఉంటుంది. S 100లో 2.1kWh బ్యాటరీ, S 125లో 2.7kWh, S 161లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. గరిష్ఠ పవర్ వరుసగా 4kW, 4.7kWగా, టార్క్ 16Nmగా ఉంది. మూడు వేరియంట్ల గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ.
ఫ్యామిలీ స్కూటర్‌గా..
కొనార్క్ డిజైన్‌ను స్పోర్టియర్ 450 సిరీస్ కంటే ఎక్కువగా ప్రాక్టికల్‌గా, కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ముందు భాగంలో 14 అంగుళాల చక్రాన్ని అమర్చారు. 1,352 మి.మీ. వీల్‌బేస్ ఏథర్ స్కూటర్లలోనే అత్యంత పొడవైనది. ముందు సస్పెన్షన్ ట్రావెల్ 90 మి.మీ., వెనుక 100 మి.మీ.గా ఉంది. దీంతో గుంతలు, దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణం మరింత సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. వెనుక కూర్చునేవారి కోసం ప్యాడెడ్ గ్రాబ్ హ్యాండిల్, సౌకర్యవంతమైన సీటింగ్ ఇచ్చారు. ఈ స్కూటర్‌లో 31 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త బ్రేకింగ్ సిస్టమ్
భద్రత పరంగా ఏథర్ కొత్త AeBS (Advanced Electronic Braking System)ను పరిచయం చేసింది. ఎలక్ట్రానిక్ నియంత్రణ ద్వారా బ్రేకింగ్ సమయంలో నియంత్రణ, స్థిరత్వాన్ని మెరుగుపరచడం దీని ఉద్దేశం. వేరియంట్‌ను బట్టి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేదా డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది.
ఛార్జింగ్..
కొనార్క్‌లో 450W ఆన్‌బోర్డ్ ఛార్జర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అదనంగా 900W ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే రెండు ఛార్జింగ్ వ్యవస్థలను కలిపి 1.35kW ఛార్జింగ్ సామర్థ్యం పొందవచ్చని ఏథర్ తెలిపింది. స్టాండర్డ్ ఛార్జర్‌తో S 100 బ్యాటరీని 0–80 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటలు పడుతుంది. S 125కి 4 గంటల 30 నిమిషాలు, S 161కి 5 గంటల 40 నిమిషాలు పడతాయి. కాంబైన్డ్ ఛార్జింగ్‌తో ఈ సమయం వరుసగా 2 గంటలు, 2 గంటల 25 నిమిషాలు, 3 గంటల 10 నిమిషాలకు తగ్గుతుంది.
మ్యాజిక్‌కీ.. ఇతర ఫీచర్లు
ఏథర్ కొనార్క్‌లో మ్యాజిక్‌కీ అనే కీలెస్ ఇగ్నిషన్ వ్యవస్థ ఉంది. రైడర్ స్కూటర్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే సదుపాయం కూడా ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లలో 7 అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే, ఎయిర్‌వాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సర్వీసింగ్ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను 26 లక్షల కిలోమీటర్లకు పైగా ఫీల్డ్ డేటా ఆధారంగా అభివృద్ధి చేసినట్లు ఏథర్ చెబుతోంది.
వారంటీ విషయానికి వస్తే, కొనార్క్‌కు ప్రామాణికంగా 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వాహన, బ్యాటరీ వారంటీ ఉంది. ఏథర్‌స్టాక్ ప్రో ద్వారా దీనిని 5 సంవత్సరాలు/60,000 కి.మీ. వరకు, అదనపు ఆప్షన్‌తో బ్యాటరీ వారంటీని 10 సంవత్సరాలు లేదా 1 లక్ష కి.మీ. వరకు పొడిగించుకోవచ్చు.
సెప్టెంబర్ నుంచే డెలివరీలు
కొనార్క్ డెలివరీలు దశలవారీగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన S 125, S 161 వేరియంట్ల డెలివరీలు వచ్చే సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యేలా కంపెనీ ప్రణాళిక రూపొందించింది. తొలుత ఎంపిక చేసిన రాష్ట్రాల్లో డెలివరీలు మొదలై, అనంతరం ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. 100 కి.మీ. వేరియంట్, 200 కి.మీ. వెర్షన్, Z లైన్ మోడళ్లను కూడా దశలవారీగా మార్కెట్లోకి తీసుకురానుంది.
ఇదీ చదవండి: టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..


