తల్లిదండ్రులు ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి చట్టపరంగా ‘ఇంటెస్టేట్’ (ఒక వ్యక్తి తన ఆస్తిపై ఎలాంటి చెల్లుబాటయ్యే వీలునామా రాయకుండానే మరణించడాన్ని చట్టపరంగా ఇంటెస్టేట్ అంటారు) కిందకు వస్తుంది. ఇటువంటి సమయంలో వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. భారతదేశంలో హిందూ వారసత్వ చట్టం (1956, 2005 సవరణ) ప్రకారం, వీలునామా లేని ఆస్తిపై మొదటి హక్కు క్లాస్-1 వారసులకు (భార్య/భర్త, తల్లి, కుమారులు, కుమార్తెలు) మాత్రమే ఉంటుంది. వీరందరికీ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది. 2005 సవరణ ప్రకారం తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా పుట్టుకతోనే సమాన హక్కు ఉంటుంది. క్లాస్-1 వారసులు ఎవరూ లేని పక్షంలోనే ఆస్తి క్లాస్-2 వారసులైన తోబుట్టువులకు (అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లకు) సమానంగా బదిలీ అవుతుంది.
ఆస్తి పంపకాలకు మార్గాలు
తోబుట్టువులు తమకు వచ్చిన ఉమ్మడి ఆస్తిని వివాదాలు లేకుండా పంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. అందరి అంగీకారంతో ఆస్తిని సరిహద్దులతో సహా విడదీసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక సోదరుడు లేదా సోదరి తమ వాటాను మరొకరికి ఇచ్చేయాలనుకుంటే చట్టబద్ధంగా డీడ్ రాసి రిజిస్టర్ చేయాలి. ఆస్తిని మూడో వ్యక్తికి అమ్మేసి వచ్చిన నగదును సమానంగా పంచుకోవాలి. ఒకరే ఆస్తిని ఉంచుకోవాలనుకుంటే మిగిలిన వారి వాటా విలువను లెక్కించి వారికి నగదు చెల్లించాలి.
మ్యుటేషన్ తప్పనిసరి
తల్లిదండ్రులు మరణించిన వెంటనే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ (పేర్ల మార్పిడి) చేయించుకోవడం అవసరం. ఒకవేళ తోబుట్టువుల మధ్య అంగీకారం కుదరకపోతే కోర్టులో పార్టీషన్ సూట్ దాఖలు చేయవచ్చు. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి లీగల్ డీడ్స్ ద్వారా సామరస్యంగా ఆస్తులను పంచుకోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం కొంటున్నారా..? బిగ్ అలర్ట్


