చండీగఢ్: పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) దారుణ హత్యకు గురయ్యారు. కిడ్నాప్‌నకు గురైన ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న మృతి చెందారు. బాధితురాలి తల్లి కాంతా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు ఇద్దరు అనుమానితులపై అపహరణ, హత్య కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి చండీగఢ్‌లోని సెక్టార్ 34లో గల మద్యం దుకాణం వద్దకు రావాల్సిందిగా ఆమెకు పరిచయస్తులైన శుభి, పిందా అనే వ్యక్తులు ఫోన్ చేశారు. మంజీత్ అక్కడికి చేరుకోగానే, వారు బలవంతంగా ఆమెను కారులోకి లాగి మొరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై తీవ్రంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆమెను గమనించిన ఓ పరిచయస్తుడు దుప్పటితో మంటలను ఆర్పి, వెంటనే స్థానిక మొరిండా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మొహాలీ ఆసుపత్రికి, జూలై 9న పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌కు తరలించారు.
కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలో ఉన్న మంజీత్, ఆగస్టు 5న కొద్దిసేపు స్పృహలోకి వచ్చి జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 26న ఆమె కన్నుమూశారు. ఈ ఘటనపై సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 140(1) (కిడ్నాప్), 103(1) (హత్య), 3(5) కింద కేసు నమోదైంది. మృతురాలికి విడాకులు అయ్యాయని, ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని సెక్టార్ 34 ఎస్హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ షాదీ లాల్ తెలిపారు. నిందితుల్లో ఒకరితో మంజీత్ గతంలో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిశోర్ జన సేవా కేంద్రం ప్రారంభం.. లక్ష్యం ఇదేనట!


