సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు | Telangana Suryapet Neem Tree Clash News | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు

Aug 29 2026 11:23 AM | Updated on Aug 29 2026 5:04 PM

Telangana Suryapet Neem Tree Clash News

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.

మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. 

దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే.. 

పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. 

ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్‌కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్‌ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్‌ మర్డర్‌తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి: జిమ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement