మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? | KSR's Comments On Margadarsi Case Undavalli Ramoji Rao Supreme Court | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?

Aug 25 2026 1:45 PM | Updated on Aug 25 2026 2:05 PM

KSR's Comments On Margadarsi Case Undavalli Ramoji Rao Supreme Court

భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.

ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.

మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్‌లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్‌లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్‌లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?

అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.

ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్‌కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.

ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్‌నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్‌బీఐ అంగీకరించడమే కదా!

రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.

సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్‌యూఎఫ్‌లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.

రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement