20 వేల కి.మీ.లకు చేరనున్న గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్
పెట్రోకెమికల్స్, ఎల్‌పీజీ, ఎరువుల రంగాల్లో పెట్టుబడుల జోరు
భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టి
42వ ఏజీఎంలో సంస్థ చైర్మన్ దీపక్ గుప్తా వెల్లడి
ప్రభుత్వ రంగ సంస్థ ‘గెయిల్ (ఇండియా) లిమిటెడ్’ సహజవాయువు పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ, ఎల్‌ఎన్‌జీ సరఫరా వనరుల విభిన్నీకరణ, పెట్రోకెమికల్స్, ఎల్‌పీజీ మౌలిక వసతుల పెంపుతో పాటు స్వచ్ఛ ఇంధన (క్లీన్ ఎనర్జీ) సాంకేతికతల్లో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం అత్యంత కీలకమని స్పష్టం చేసింది. గెయిల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ దీపక్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఇంధన పరివర్తన ఎంత ముఖ్యమో, ఇంధన భద్రత కూడా అంతే కీలకం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లలోని బలహీనతలను బయటపెట్టాయి’’ అని పేర్కొన్నారు.
తర్వలో 20 వేల కి.మీ పైప్‌లైన్ నెట్‌వర్క్
దేశంలోనే అతిపెద్ద సహజవాయువు రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న గెయిల్ పైప్‌లైన్ల మొత్తం పొడవు ఇప్పటికే 18,690 కి.మీ.లకు చేరిందని తెలిపారు. మరో 1,500 కి.మీ.ల పైప్‌లైన్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అవి పూర్తయితే సంస్థ నెట్‌వర్క్ దాదాపు 20 వేల కి.మీ.లకు చేరుతుందని చెప్పారు. జామ్‌నగర్–లోని మధ్య ఉన్న 1,427 కి.మీ ఎల్‌పీజీ పైప్‌లైన్ సామర్థ్యాన్ని ఏడాదికి 32.5 లక్షల టన్నుల నుంచి 65 లక్షల టన్నులకి రెట్టింపు చేస్తున్నారు. దీనికి తోడు మొత్తం 1,775 కి.మీ.ల పొడవుతో మూడు కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ల అభివృద్ధికి పీఎన్‌జీఆర్‌బీ అనుమతి ఇచ్చింది.
భారీ పెట్రోకెమికల్ ప్రాజెక్టులు
మహారాష్ట్రలోని ఉసార్‌లో ఏడాదికి 5 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రొపేన్ డీహైడ్రోజనేషన్–పాలీప్రొపిలీన్ (పీడీహెచ్–పీపీ) ప్రాజెక్టును గెయిల్ అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే తొలి పీడీహెచ్ ఆధారిత పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్‌గా దీన్ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.11,256 కోట్ల పెట్టుబడి అంచనా. అలాగే పటా ప్లాంట్‌లో ఏడాదికి 60 వేల టన్నుల సామర్థ్యంతో కొత్త పాలీప్రొపిలీన్ యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఆ కాంప్లెక్స్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 8.10 లక్షల టన్నుల నుంచి 8.70 లక్షల టన్నులకు పెరిగింది. మంగళూరులో ఏడాదికి 12.5 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి.
ఎరువుల రంగంలోకి అడుగులు
గ్యాస్ ఆధారిత ఎరువుల తయారీ రంగంలోనూ గెయిల్ అడుగుపెట్టనుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు ఎరువుల ప్లాంట్ల ఏర్పాటుకు సంస్థ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులపై కలిపి సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సహజవాయువు వినియోగం పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు తోడ్పాటు లభిస్తుందని గుప్తా తెలిపారు.
ఎల్‌ఎన్‌జీ సరఫరా, రవాణా విస్తరణ
గెయిల్ ఎల్‌ఎన్‌జీ సోర్సింగ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఏడాదికి 16.56 మిలియన్ టన్నులుగా ఉందని తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందాలతో పాటు మార్కెట్ ఆధారిత కొనుగోళ్లను సంస్థ చేపడుతోందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గెయిల్ 132 ఎల్‌ఎన్‌జీ కార్గోలను దిగుమతి చేసుకుంది. వీటిలో ఏడు స్పాట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినవని తెలిపారు. ఎల్‌ఎన్‌జీ రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక చార్టర్ ఒప్పందాల కింద రెండు ఎల్‌ఎన్‌జీ నౌకలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సంస్థకు ఎల్‌ఎన్‌జీ రవాణా కోసం గెయిల్ వద్ద 9 భారీ షిప్‌మెంట్ నౌకలు అందుబాటులో ఉన్నాయి.
దాభోల్‌లో ఏడాదంతా కార్యకలాపాలు
బ్రేక్‌వాటర్ నిర్మాణం పూర్తికావడంతో దాభోల్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏడాది పొడవునా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని గుప్తా తెలిపారు. వర్షాకాలంలోనూ తొలిసారి ఎల్‌ఎన్‌జీ కార్గోను స్వీకరించడంతో పాటు, ఈ టెర్మినల్ తన 1,000వ ఎల్‌ఎన్‌జీ కార్గోను కూడా అందుకున్నట్లు చెప్పారు. కొంకణ్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ను గెయిల్‌లో విలీనం చేసేందుకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: యూట్యూబ్‌తో అమెజాన్ చేతులు


