జియో మెగా ఐపీఓకు సై! | Jio Platforms set for mega IPO of 27 crore equity shares | Sakshi
Sakshi News home page

జియో మెగా ఐపీఓకు సై!

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

Jio Platforms set for mega IPO of 27 crore equity shares

27 కోట్ల తాజా షేర్ల జారీ.. 

సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్‌ దరఖాస్తు 

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌సేవల్లోకి ప్రవేశం 

49వ ఏజీఎంలో ప్రకటించిన ముకేశ్‌ అంబానీ 

రూ.37,700 కోట్ల నిధుల సమీకరణకు చాన్స్‌! 

దేశంలో అతిపెద్ద పబ్లిక్‌ ఆఫర్‌గా రికార్డు

టెలిక, డిజిటల్‌ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించారు. శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలోకి జియో అడుగుపెడుతుండగా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్లీన్‌ ఎనర్జీ, కన్జూమర్‌ వ్యాపారాల్లో భారీ ప్రణాళికలకు రిలయన్స్‌ తెరతీసింది.

ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) దిశగా కీలక అడుగుపడింది. రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌ డైరెక్టర్ల బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచినట్లు ఏజీఎంలో ఆర్‌ఐఎల్‌ చైర్మన్, ఎండీ ముకేశ్‌ అంబానీ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకెక్కనున్న ఈ ఇష్యూ ద్వారా జియో రూ.10 ముఖ విలువ గల 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల (4 బిలియన్‌ డాలర్లు) కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్‌ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్‌ విలువను 137 బిలియన్‌ డాలర్లు దాదాపు (రూ.13 లక్షల కోట్లు)గా లెక్కగడుతున్నారు.  

జియో టాప్‌... 
దేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా రూ.27,870 కోట్ల ఇష్యూతో హ్యుందాయ్‌ నిలుస్తోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు జియో ఇష్యూ పూర్తయితే ఈ రికార్డులన్నీ చెరిపేసి ‘టాప్‌’లేపనుంది. కాగా, 2008 తర్వాత రిలయన్స్‌ గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి ఐపీఓగా కూడా ఇది నిలుస్తుంది.

టెలికం టు డిజిటల్‌ టెక్నాలజీ దిగ్గజం 
2016లో సేవలు ప్రారంభించిన జియో.. దశాబ్దకాలంలో దేశ టెలికం స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. భారత్‌లో మొబైల్‌ డేటా విప్లవాన్ని తీసుకొచి్చంది. ముఖ్యంగా టెలికం నుంచి.. క్లౌడ్‌ సరీ్వసులు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్లు, ఏఐ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించి.. పూర్తి స్థాయి డిజిటల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. 

ఏఐ ఇన్‌ఫ్రాతో పాటు ప్రత్యేకంగా భారత్‌ కోసం ఏఐ లాంగ్వేజ్‌ మోడల్స్‌ అభివృద్ది చేసేందుకు ఎని్వడియాతో 2023లో జియో జట్టుకట్టడం తెలిసిందే. 2026 నుంచి ఏడేళ్లలో ఏఐ కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల కోట్లను వెచి్చంచనున్నట్లు కూడా అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే  మెటా, గూగుల్, కేకేఆర్, జనరల్‌ అట్లాంటిక్, వంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశాయి. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్‌ఐఎల్‌కు 66.43 శాతం వాటా మెజారిటీ వాటా ఉండగా.. మెటా 9.99%, గూగుల్‌ 7.73% వాటాలను దక్కించుకున్నాయి.

ఇక జియో శాటిలైట్‌ ఇంటర్నెట్‌...
శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ (శాట్‌కామ్‌)లో సరికొత్త విప్లవానికి జియో శ్రీకారం చుడుతోంది. స్వదేశీ సమాచార ఉపగ్రహాలతో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీ ఆకాశ్‌ అంబానీ ప్రకటించారు. ‘భారత్‌ను జియో నేలపై అనుసంధానించింది. ఇక అంతరిక్షం నుంచి కూడా కనెక్ట్‌ చేయాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ఇంకా మారుమూల పల్లెల్లో, ద్వీపాల్లో ప్రజలకు టెలికం సేవలు అందుబాటులో లేవు. అలాంటి వారికి శాటిలైట్‌ కనెక్టివిటీ వారధిగా నిలుస్తుంది. భారత్‌ కోసం తక్కువ భూకక్ష్యలో తిరిగే స్వేదేశీ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోంది’ అని ఆకాశ్‌ చెప్పారు.

 శాటిలైట్‌ టెలికం, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ప్రపంచ దిగ్గజ ఉపగ్రహ నెట్‌వర్క్‌ ప్రొవైడర్లతో జట్టుకడతామని, తద్వారా శాటిలైట్‌ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘సొంతంగా గ్రౌండ్‌ స్టేషన్‌ ఇన్‌ఫ్రాను నెలకొల్పుతాం. స్పేస్‌ నుంచి గ్రౌండ్‌ దాకా పూర్తి స్థాయి శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటే మా లక్ష్యం. ఈ చర్యలతో అంతరిక్ష రంగంలోనూ భారత స్వావలంభనను జియో బలోపేతం చేస్తుంది’ అని ఆకాశ్‌ పేర్కొన్నారు. కంపెనీ మొబైల్‌ యూజర్లందరినీ 2030 నాటికి పూర్తిగా 5జీ నెట్‌వర్క్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

రిలయన్స్‌ భవిత భద్రం.. 
వారసులకు వ్యాపారాల అప్పగింత ప్రణాళిక దాదాపు పూర్తయిందని ముకేశ్‌ చెప్పారు. ఆకాశ్, ఇషా, అనంత్‌ అంబానీలు ప్రస్తుతం గ్రూప్‌లోని కీలక వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను వారే చూసుకుంటున్నారు. టెలికం, రిటైల్, డిజిటల్‌ సర్వీసులు, న్యూ ఎనర్జీల్లో ప్రధాన బిజినెస్‌లతో పాటు గ్రూప్‌ భవిష్యత్తు వృద్ధిని వారే నడిపిస్తారని ముకేశ్‌ పేర్కొన్నారు. ‘మీ కంపెనీ భవిష్యత్తు.. రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే వారి చేతుల్లో భద్రంగా ఉంది’ అని వాటాదారులతో ముకేశ్‌ చెప్పారు. ప్రస్తుతం ఆకాశ్‌ టెలికం.. ఇషా రిటైల్‌ విభాగాలను నడిపిస్తుండగా.. అనంత్‌ను గతేడాది రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించడం ద్వారా ఇంధన బిజినెస్‌లను అప్పగించారు.

2030కల్లా అత్యంత చౌకగా ఏఐ 
ప్రతి భారతీయునికి ఏఐని అత్యంత చౌకగా అందించడమే లక్ష్యమని ఆకాశ్‌ పేర్కొన్నారు. మొబైల్‌ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్నారు. ‘భారత్‌ కోసం, భారత్‌ ద్వారా రిలయన్స్‌ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలందిస్తాం.  ఇందుకోసం జామ్‌నగర్‌లో రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ సొంత ఏఐ బ్యాక్‌బోన్‌ను నెలకొల్పుతోంది. ఈ ఏడాది చివరికల్లా తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సిద్ధమవుతుంది’ అని ఆకాశ్‌ చెప్పారు.

 ఇప్పటికే ఏఐ కోసం గూగుల్, మెటాలతో జట్టుకట్టామన్నారు. హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయ రంగాల కోసం ‘జియోభారత్‌ఐక్యూ’, ‘ఏఐ వ్యాపార్‌’ వంటి ప్రత్యేక టూల్స్‌ను ప్రవేశపెడతామని వివరించారు. కాగా, భారత్‌ కోసం రూపొందించే ఏఐ ప్రాజెక్టుల్లో మన యువ ఇంజినీర్లు పాలుపంచుకోవాలని ముకేశ్‌ పిలుపునిచ్చారు. ‘ఎక్కడో రూపొందించిన ఏఐని వాడే దేశంగా మనం మిగిలిపోకూడదు. ఏఐ క్రియేటర్‌గా, దాన్ని అదిపుచ్చుకునే శక్తిగా, ప్రపంచ లీడర్‌గా ఎదగాలి’ అని  పేర్కొన్నారు.

ఏజీఎంలో ఇతర ముఖ్యాంశాలు...
→ సోలార్‌ పవర్, బ్యాటరీలు, పవన విద్యుత్, హైడ్రోజన్, కంప్రెస్డ్‌ బయో గ్యాస్, బయో ఎనర్జీ, కోల్‌ గ్యాసిఫికేషన్‌ వంటి రంగాలపై ఫోకస్‌ చేయడం ద్వారా భారత ఇంధన భద్రతకు దన్నుగా నిలవడంతో పాటు దేశాన్ని గ్రీన్‌–క్లీన్‌ ఎనర్జీ దిశగా నడిపిస్తున్నామని ముకేశ్‌ చెప్పారు. రానున్న కాలంలో ఆయా రంగాల్లో 2 లక్షల కొలువులు లభిస్తాయనేది కంపెనీ అంచనా. 

→ 2025–26లో రిలయన్స్‌ మీడియా వ్యాపారం రూ.34,917 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియోహాట్‌స్టార్‌ దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించింది. బిలియన్‌ డౌన్‌లోడ్‌ల మార్కును దాటిన తొలి భారతీయ ఓటీటీ సరీ్వసుగా కూడా నిలిచినట్లు ఆకాశ్‌ చెప్పారు. ఏఐ ఆధారిత కంటెంట్‌ ప్రొడక్షన్‌ ప్లాట్‌ఫామ్‌... జియోస్టార్‌ జెన్‌ఏఐ మీడియా స్టూడియో (జామ్స్‌)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. 
 

→ ఎఫ్‌ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌   2029–30 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయి చేరుతుందని రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ పేర్కొన్నారు. అతిపెద్ద దేశీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ లక్షమని చెప్పారు.


‘రిలయన్స్‌ వాటాదారులకు విలువను చేకూర్చడంలో జియో ఐపీఓ ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జియోకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కొత్త ఇన్వెస్టర్లందరికీ భరోసా ఇస్తున్నా’. 
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ సీఎండీ  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement