ప్రాణాధారమైన ‘వెంటిలేటర్ల’నూ వదలకుండా అవినీతి
నియో నాటాల్ వెంటిలేటర్ కొనుగోళ్లలో దోపిడీ
బహిరంగ మార్కెట్‌లో ధర రూ.22 లక్షల నుంచి గరిష్టంగా రూ.26 లక్షలు
ఏపీ సర్కార్ కొంటున్నది ఏకంగా రూ.30.24 లక్షలకు..
ఒక్కో పరికరంపై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల అదనపు భారం
రేట్ కాంట్రాక్ట్ నెపంతో మరో రెండేళ్లు ఇదే ధరకు పరికరాల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే నిరుపేద రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల పలికే నియోనాటల్(నవజాత శిశువు)వెంటిలేటర్‌ను ఏకంగా రూ.30.24 లక్షలకు కొనుగోలు చేసేలా శుక్రవారం వైద్య శాఖ బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్‌సీ) ఆమోదం తెలిపింది. అధిక ధరలకు వెంటిలేటర్ల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.మూడు కోట్లకుపైనే నేతలు కమీషన్ల రూపంలో బొక్కేయనున్నారని విమర్శలు వస్తున్నాయి.
వైద్య పరికరాల కొనుగోళ్లపై కీలక ప్రజాప్రతినిధి 10 శాతం అంతకంటే పైనే కమీషన్‌లు డిమాండ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. దీనికి తోడు వైద్య సేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఐడీసీ)లోని కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఖరారు, పర్చేజింగ్ ఆర్డర్(పీవో) జారీ, బిల్లులు మంజూరు ఇలా వివిధ దశల్లో కాంట్రాక్టర్‌లను కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు అందరూ సిండికేటై ఇతర రాష్ట్రాలు, కేంద్ర వైద్య శాఖలకు సరఫరా చేస్తున్న దాని కంటే అత్యధిక ధరలకు ఏపీలో టెండర్లు వేస్తున్నారు.
ఏపీలో దోపిడీకి తమిళనాడు ధరలే సాక్ష్యం
అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు రెండేళ్లుగా ఎంఎస్‌ఐడీసీలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్‌ల కొనుగోలుకు కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. ఎల్–1 సంస్థ వియాన్ ఫాబియాన్ హెచ్‌ఎఫ్‌ఓ వెంటిలేటర్‌ను రూ.30.24 లక్షలతో సరఫరా చేసేలా టెండర్ వేసింది.
అయితే ఇదే మేక్, మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్‌లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్‌పై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 38, రెండేళ్ల రేట్ కాంట్రాక్ట్‌తో మరిన్ని వెంటిలేటర్లను ఇదే కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బల్క్ ఆర్డర్ మీద బహిరంగ మార్కెట్‌లో రేట్లు తగ్గకుండా ఏపీలో మాత్రం రేట్లు అమాంతం పెరుగుతుండటం గమనార్హం.

నియోనాటల్ వెంటిలేటర్‌ను రూ.25.50 లక్షలతో కొనుగోలుకు తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రేట్ కాంట్రాక్ట్
ఇదే టెండర్‌లో డ్రాగర్ బేబీలాగ్ వీఎన్ 600 మోడల్ వెంటిలేటర్‌ను రూ.30.93 లక్షలకు సరఫరా చేసేలా టెండర్ వేసిన మరో సంస్థ ఎల్–2గా నిలిచింది. ఇదే మోడల్ పరికరాన్ని తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రూ.25.50 లక్షలకే కొంటోంది. 2028 జూలై వరకూ ఈ రేట్ కాంట్రాక్ట్ ఉంది. ఇదిలా ఉండగా ఒకే రకం పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.5.50 లక్షల అధిక ధరకు సరఫరా చేసేలా కాంట్రాక్టర్ టెండర్ వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే నేతలకు కమీషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్‌లు పరికరాల ధరలు అమాంతం ఎలా పెంచేస్తున్నారో తేటతెల్లం అవుతోంది.
నీకు సగం.. నాకు సగం..
పరికరాల కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలను వైద్య శాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధికి కమీషన్లు ముట్టజెప్పేలా రెండు సంస్థలు టెండర్‌కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలు పరికరాల సరఫరాను చెరి సగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ మేరకు కాంట్రాక్ట్ ఖరారుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో, తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్‌సీలోనూ చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం.
వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రూ.15 లక్షలతో కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు రూ.7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన వంద పరికరాల కొనుగోళ్లలో ఏకంగా రూ. ఏడు కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి.


