సాక్షి, విజయవాడ: విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్నటి నుంచి చలసాని ఆంజనేయులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక చలసాని ఆంజనేయులు ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా రాజీనామా చేయాలని ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో మంత్రుల ఒత్తిళ్లతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు.
రెండు గంటల పాటు ఆసుపత్రిలో చలసాని ఆంజనేయులతో చర్చించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారథి.. ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఆదేశాలతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, బుధవారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్నా కానీ చలసాని ఆంజనేయులను మంత్రులు వదల్లేదు. రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో ఇవాళ ఆంజనేయులు.. విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.


