‘అరాచక బ్యాచ్‌లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయి’ | Karumuri Venkat Reddy Slams Chandrababu Naidu Govt Over Super Six Schemes | Sakshi
Sakshi News home page

‘అరాచక బ్యాచ్‌లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయి’

Aug 7 2026 5:24 PM | Updated on Aug 7 2026 5:41 PM

YSRCP Spokes Person Karumuri Venkat Reddy Slams Chandrababu Sarkar

తాడేపల్లి :  చంద్రబాబు పాలనలో ఏపీ సర్వం భ్రష్టు పట్టిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాల అరాచక బ్యాచ్‌లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయని, అలాంటి చంద్రబాబు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడని కారుమూరి.. చేనేతలకు వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాటు రూ. 24వేలు చొప్పున ఇస్తే.. చంద్రబాబు రెండేళ్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. 

‘మొత్తం రూ.75 వేలు చొప్పున చేనేతలకు చంద్రబాబు బకాయి పడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని చెప్పటం సిగ్గుచేటు. కుప్పం వెళ్లి ఎవర్ని అడిగినా సూపర్ సిక్స్ అమలయ్యాయో లేదో చెప్తారు. లేదా మంగళగిరి వెళ్లి అడగినా జనమే సరైన సమాధానం చెప్తారు. రోడ్లన్నీ అద్దాల్లాగ మార్చేశామని పచ్చి అబద్దాలు చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే వాస్తవం తెలుస్తుంది. చంద్రబాబు అరాచకం తట్టుకోలేక పరిశ్రమలు పారిపోతున్నాయి. 

రూ.6వేల కోట్ల పెట్టబడి వస్తే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందంటూ నిస్సిగ్గుగా చెప్తున్నారు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే జనం భయపడి పోతున్నారు. విశాఖలో మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?, డీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. జెన్ జీ ని గొడ్డలి బ్యాచ్‌ అని, గంజాయి బ్యాచ్ అంటూ కించపరచటం దుర్మార్గం. చంద్రబాబు అహంకారపు మాటలను జెన్ జీ గ్రహిస్తూనే ఉంది. టీడీపీలో మట్టిబ్యాచ్, నకిలీ మద్యం బ్యాచ్, వెన్నుపోటు బ్యాచ్, భార్యల చీరలు చించే గలీజు బ్యాచ్, చికెన్ షాపులో కమీషన్లు కొట్టేసే బ్యాచ్.. ఇలాంటి బ్యాచులన్నీ  ఉన్నాయి. ఆ బ్యాచ్‌లన్నిటికీ చంద్రబాబే హెడ్. డ్రగ్స్ తీసుకుని పార్లమెంటుకి వెళ్లే బ్యాచ్ కూడా చంద్రబాబు దగ్గరే ఉంది.

చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్క సమస్య నూ పరిష్కారం చేయటం లేదు. అందుకే జనం జగన్ దగ్గరకు వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం వదిలి వెళ్లకుండా ఉండాలి. హోంమంత్రి అనిత డమ్మీ మంత్రి. ఒక్క‌ కానిస్టేబుల్‌ను కూడా ట్రాన్సఫర్ చేయించుకోలేని హోంమంత్రి ఆమె. అలాంటి హోంమంత్రి మాటలకు విలువ లేదు. పవన్ కళ్యాణ్‌కు క్యాబినెట్ అంటే లెక్క లేదు. అందుకే పదేపదే క్యాబినెట్ సమావేశాలకు ఎగ్గొడుతున్నారు. ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement