సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు.
..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి.
..చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026


