మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం | Rajahmundry Medico Incident: Priyanka Brain Dead, Condition Very Critical | Sakshi
Sakshi News home page

మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం

Aug 7 2026 4:45 PM | Updated on Aug 7 2026 4:58 PM

Rajahmundry Incident: Medico Priyanka Condition Is Very Critical

సాక్షి, హైదరాబాద్‌: మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో కారు ప్రమాదంలో ప్రియాంక గాయపడిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ప్రియాంక బైక్‌ను యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. రాష్ట్రవ్యా­ప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటన సంచలనం రేపింది.

ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్‌ ఆదిత్యమాల్‌కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్‌ సిబ్బంది బ్రీత్‌ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.

మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్‌ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్‌ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్‌ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్‌ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.

ఇది చూసిన మాల్‌ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్‌ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాద ఘటనపై థియేటర్‌ మేనేజర్‌ విజయ్‌ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్‌ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్‌ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తు­లో జరిగిన ప్రమా­దమేనని, ఉద్దేశపూ­ర్వకంగా జరి­గింది కాద­ని హడావిడిగా ప్రక­టించ డం పలు అనుమానాలకు తావిస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement