రెడ్‌బుక్‌ పాలనలో మరో అంకం రాత్రిళ్లు పోలీస్‌ టెర్రర్‌ | Illegal cases in Chandrababu government | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ పాలనలో మరో అంకం రాత్రిళ్లు పోలీస్‌ టెర్రర్‌

Sep 25 2026 5:29 AM | Updated on Sep 25 2026 5:29 AM

Illegal cases in Chandrababu government

ఖాకీలను వుసిగొల్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు సర్కారు

డీఎస్సీ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు 

సీబీఐ విచారణ కోరితే దుర్మార్గంగా అరెస్టులు 

శాప్‌ ఆఫీస్‌ వద్ద శాంతియుత నిరసన పైనా సర్కారు జులుం

వీడియో ఫుటేజీతో 260 మందిని గుర్తించి కేసులు నమోదుకు బరితెగింపు.. మహిళ అని చూడకుండా విజయవాడ మాజీ మేయర్‌ భాగ్యలక్ష్మి ఇంటికి రాత్రివేళ పోలీసులు వెళ్లి హడావుడి 

ఒక్క విజయవాడలోనే 70 మంది ఇళ్లకు వెళ్లి హంగామా.. కొందరి అరెస్టు.. మరికొందరికి నోటీసులు 

నందిగామలో వైఎస్సార్‌సీపీ నాయకులను రాత్రి వేళ అరెస్టు చేసి విజయవాడ తరలింపు

సాక్షి, అమరావతి : రెడ్‌బుక్‌ పాలనలో రాత్రివేళ కూడా పౌరుల ప్రశాంతతను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని భయాందోళనలు సృష్టిస్తోంది. గురువారం రాత్రి విజయవాడ తదితర ప్రాంతాల్లో పోలీసులను పురిగొల్పి అక్రమ కేసులు, అరెస్టులు, నోటీసులతో రెడ్‌బుక్‌ పాలనకు నిదర్శనంగా నిలిచింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్‌ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు ఈ నెల 21న విజయవాడలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే.

శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిపై లోకేశ్‌ యువగళం రౌడీ దళం దాడికి దిగింది. పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కొని దాడులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే రోజున ఆందోళలను భగ్నం చేయడానికి విఫలయత్నం చేసిన పోలీసులు అడుగడుగునా వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. హౌస్‌ అరెస్టులు చేయడంతో పాటు పలువురిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.

అయినా చంద్రబాబు ఉక్రోశం చల్లారక.. ఐదేళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనను సాకుగా చూపి 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని నిర్ణయించారు. ప్రజా వ్యతిరేకతకు భయపడి ఆ ప్రయత్నం నుంచి వెనక్కుతగ్గి.. మరో రీతిలో వేధించేందుకు కుతంత్రం రచించారు. ఈ క్రమంలో శాప్‌ కార్యాలయం వద్ద ఆందోళన జరిగిన నాలుగు రోజులకు వీడియో ఫుటేజి ద్వారా 260 మందిని గుర్తించినట్టు పోలీసులు తీరుబడిగా రెడ్‌బుక్‌ టెర్రర్‌లో మరో అంకానికి తెరలేపారు. వారందరిపైనా కేసులు నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పలువురు ఇళ్లకు వెళ్లి పోలీసులు హల్‌చల్‌ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లను సంతృప్తి పరచడానికి పోలీసులు వేధింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖాకీల అత్యుత్సాహం  
⇒ డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. శాంతియుత నిరసన తెలపడం నేరమన్నట్లుగా వ్యవహరిస్తూ నాలుగు రోజుల తర్వాత అక్రమ కేసులు, అరెస్టులు అంటూ వేధింపులకు దిగడం దారుణమని ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్టు ఉందని మండిపడుతున్నారు. 

⇒ మహిళలు అని కూడా చూడకుండా గురువారం రాత్రి  విజయవాడ నగర మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ మహిళా నేత రాయన భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పారు. నగర మొదటి పౌరురాలిగా సేవలు అందించిన తన పట్ల పోలీసుల తీరు బాగోలేదని, మహిళ పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా.. అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. దీంతో పోలీసులు కేసుకు సంబంధించిన నోటీసును అందించి వెనుదిరిగారు.  

⇒ మరో మహిళా నేత పసుపులేటి వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు వచ్చినట్టు చెప్పడంతో ఆమె సైతం తీవ్రంగా మండిపడ్డారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీస్‌ స్టేషన్‌కు రావాలని నోటీసు ఇచ్చి వెళ్లారు.  

⇒ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాది సుభానీని సింగ్‌నగర్‌ పోలీసులు తీసుకెళ్లారు. 64వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ యర్రగోళ్ల శ్రీరామయాదవ్‌ను కూడా తీసుకెళ్లారు. అమిత్‌ను టాస్క్ ఫోర్స్‌ పోలీసులు, గెల్లిపోగు రాజును సూర్యారావుపేట పోలీసులు, వలీని సింగ్‌నగర్‌ పోలీసులు రాత్రివేళ తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క విజయవాడలోనే సుమారు 70 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. అరెస్టులు అంటూ భయాందోళనలు సృష్టించారు.  

⇒ నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను గురువారం రాత్రి విజయవాడ పోలీసులు తీసుకెళ్లారు. కంచికచర్ల వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వేమా సురే‹Ù, నందిగామకు చెందిన బెజవాడ రాజశేఖర్‌ను మాచవరం పోలీసులు తీసుకెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలువురు నేతలపై కేసులు ఉన్నాయని, అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు చెబుతున్నారు. డీఎస్సీ స్కామ్‌పై శాంతియుత నిరసన తెలిపితే అక్రమ కేసులు, అరెస్టులతో పోలీసులు టెర్రర్‌ రేపడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement